Air India pee-gate: శంకర్ మిశ్రాపై విరుచుకుపడుతున్న భరతనాట్య కళాకారులు!

ABN , First Publish Date - 2023-01-13T21:32:49+05:30 IST

న్యూయార్క్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో వృద్దురాలైన సహ ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన(Air India pee-gate) చేసిన ఘటన పలు మలుపులు తిరుగుతోంది.

Air India pee-gate: శంకర్ మిశ్రాపై విరుచుకుపడుతున్న భరతనాట్య కళాకారులు!

న్యూఢిల్లీ: న్యూయార్క్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో వృద్దురాలైన సహ ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన(Air India pee-gate) చేసిన ఘటన పలు మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన శంకర్ మిశ్రా ప్రస్తుతం జుడీషియల్ రిమాండులో ఉన్నాడు. తాజాగా బెయిలు కోసం జరిగిన విచారణలో శంకర్ మిశ్రా మాట్లాడుతూ.. తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపడేశాడు. ఆమెపై మూత్రం పోసింది తాను కాదని, ఆమెకు ఆమే పోసుకుందని ఫిర్యాదు చేశాడు. ఆమె 30 సంవత్సరాలుగా భరతనాట్య కళాకారిణి అని, వారు మూత్రం ఆపుకోకపోవడం సర్వసాధారణ విషయమేనని ఆరోపించాడు.

శంకర్ మిశ్రా (Shankar Mishra) చేసిన ఈ ఆరోపణలపై భరతనాట్య కళాకారులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. బాధిత మహిళ స్వయంగా భరతనాట్య కళాకారిణి (Classical dancer) కావడంతో వారంతా ఒక్కటయ్యారు. శంకర్ మిశ్రా ఆరోపణలు నిరాధారమని, ఆ ఆరోపణల ద్వారా ఆమెను మరోమారు అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భరతనాట్య కళాకారుడు రజని మహారాజ్(Rajni Maharaj) మాట్లాడుతూ.. దేశానికి గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉందని, దానిని సంరక్షించాల్సిన బాధ్యత శాస్త్రీయ కళాకారులపై ఉందని అన్నారు. అలాంటి వారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారో తనకు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా అవమానకరమన్నారు. నాట్యకారులకు వారి ఆరోగ్యంపై చాలా స్పృహ ఉంటుందని గుర్తు చేశారు. వారు యోగాతోపాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారన్నారు.

కొన్ని గంటలపాటు వారు ప్రదర్శనలు ఇవ్వాల్సి ఉండడంతో వారి శరీరంపై వారికి పూర్తి నియంత్రణ ఉంటుందని వివరించారు. ఘుంగ్రూస్(Ghungroos) ధరించిన తర్వాత తాము వాష్‌రూమ్స్‌ను కూడా ఉపయోగించలేమన్నారు. కాబట్టి అలాంటి వారిపై ఇలాంటి లేనిపోని ఆరోపణలతో అభాండాలు వేయడం సరికాదన్నారు. లాయర్లు ఇలాంటి కామెంట్లు చేయడం తగదని, దీనివల్ల న్యాయవ్యవస్థపై నమ్మకం పోతుందని అన్నారు.

ప్రముఖ కథక్ డ్యాన్సర్(Kathak Dancer) అయిన మయూఖ్ భట్టాచార్య(Mayukh Bhattacharyya) కూడా రజనీ మహారాజ్ వ్యాఖ్యలను సమర్థించారు. శంకర్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని అన్నారు. డ్యాన్సర్లకు వారి శరీరంపై పూర్తిస్థాయిలో నియంత్రణ ఉంటుందన్నారు. ఎన్నో నిబంధనలకు తాము కట్టుబడి ఉండాల్సి ఉంటుందన్నారు. తాము ఒకసారి ప్రదర్శన కోసం దుస్తులు ధరిస్తే వాష్ రూముకు వెళ్లాలని ఉన్నా వెళ్లలేమన్నారు. అదే మహిళా డ్యాన్సర్లకు అయితే అది మరింత కష్ట సాధ్యమన్నారు. శంకర్ మిశ్రా ఆరోపణలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని మయూఖ్ భట్టాచార్య వివరించారు.

Updated Date - 2023-01-13T21:34:12+05:30 IST