Pee gate Case: శంకర్ మిశ్రాకు బెయిల్

ABN , First Publish Date - 2023-01-31T19:37:36+05:30 IST

న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్రం పోసిన కేసులో నిందితుడు శంకర్ మిశ్రాకు..

Pee gate Case: శంకర్ మిశ్రాకు బెయిల్

న్యూఢిల్లీ: న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్రం పోసిన కేసు(Pee gate Case)లో నిందితుడు శంకర్ మిశ్రా (Shankar Mishra)కు ఢిల్లీ కోర్టు మంగళవారంనాడు బెయిల్ మంజూరు చేసింది. మద్యం మత్తులో తోటి ప్రయాణికురాలిపై మూత్రం పోశారనే ఆరోపణలపై బాధితురాలి ఫిర్యాదు మేరకు జనవరి 6న మిశ్రాను ఢిల్లీ పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. పటియాలా హౌస్ కోర్టుకు హాజరుపరచగా కోర్టు ఆయనకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. బెయిలు కోసం ఆయన చేసిన అభ్యర్థనను మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోమల్ గార్డ్ జనవరి 11న తోసిపుచ్చారు. దీనిని ఆయన జనవరి 25న పైకోర్టులో సవాలు చేశారు.

కాగా, జనవరి 21న మిశ్రా జ్యూడిషయల్ కస్టడీని మరో 14 రోజుల పాటు కోర్టు పొడిగించారు. మిశ్రాకు బెయిల్ ఇవ్వరాదంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదన చేశారు. విచారణకు మిశ్రా సహకరించకపోవడమే కాకుండా మొబైల్ ఫోన్లు స్విచ్ఛాప్ చేసి ముఖం చాటేశారని కోర్టుకు విన్నవించారు. మొబైల్ ఫోన్లు స్విచ్ఛాస్ చేయడంతో ఐఎంఈఐ నెంబర్‌ను ట్రేస్ చేశామని, అంతర్జాతీయంగా ఇండియా ప్రతిష్టను దిగజార్చారంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదన చేసారు. దానికి ముందు, బాధితురాలు తన వద్ద డబ్బులు తీసుకుని రాజీ చేసుకుందని, మరికొంత డబ్బు కావాలనడంతో తాను నిరాకరించానని మిశ్రా ఆరోపించాడు. అందుకే నెల రోజుల తర్వాత తనపై ఆమె కేసు పెట్టిందన్నారు. అనారోగ్యం కారణంగానే ఆమె తన సీటుపై మూత్రం పోసుకుని తనపై కేసు పెట్టిందంటూ మరో ఆరోపణ చేశారు. మిశ్రా వ్యాఖ్యలపై బాధిత మహిళ తీవ్రస్థాయిలో స్పందించింది. చేసిన తప్పుకు పశ్చాత్తాపం చెందాల్సింది పోయి తిరిగి ఇలాంటి ఆరోపణలు చేయడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేసింది. శంకర్ మిశ్రా తనపై మూత్ర విసర్జన చేసిన విషయాన్ని బాధితురాలు టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ దృష్టికి తీసుకెళ్లడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంలో విమాన సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని కూడా ఆమె ఆ లేఖలో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన అనంతరం ఎయిర్ ఇండియా శంకర్ మిశ్రాపై నాలుగు నెలల నిషేధం విధించింది.

Updated Date - 2023-01-31T19:43:09+05:30 IST