Ajit Pawar: ఒంట్లో బాగోలేకుంటే ఏవేవో రాస్తారా? మీడియాపై అజిత్ పవార్ 'ఫైర్'

ABN , First Publish Date - 2023-04-08T16:49:55+05:30 IST

ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండే వ్యక్తుల గురించి ఊహాగానాలతో వార్తలు ఎలా రాస్తారంటూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) నేత అజిత్ పవార్ ..

Ajit Pawar: ఒంట్లో బాగోలేకుంటే ఏవేవో రాస్తారా? మీడియాపై అజిత్ పవార్ 'ఫైర్'

ముంబై: ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండే వ్యక్తుల గురించి ఊహాగానాలతో వార్తలు ఎలా రాస్తారంటూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) నేత అజిత్ పవార్ (Ajit Pawar) శనివారంనాడు మీడియాను ప్రశ్నించారు. నిర్ధారణ చేసుకోకుండా, కేవలం ఊహాగానాల ఆధారంగా తనపై వార్తలు రావడం చూసి మనస్తాపానికి గురైనట్టు చెప్పారు. షెడ్యూల్ ప్రకారం అజిత్ పవార్ ఒక కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా, ఆయన ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. దీనిపై మీడియాలో ఊహాగానాలు వెలువడ్డాయి.

దీనికి ముందు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విద్యార్హతలను పలు విపక్ష పార్టీలు టార్గెట్‌గా చేయడాన్ని అజిత్ పవార్ తప్పుపట్టారు. మంత్రుల డిగ్రీలపై ప్రశ్నించడం సరైనది కాదని, ఆ నేతలు తమ పదవీకాలంలో ఏమి సాధించారన్నదే ప్రధానమని అన్నారు. ఆ వెనువెంటనే ఆయన ముందస్తు షెడ్యూల్ ప్రకారం శుక్రవారంనాడు హాజరుకావాల్సిన ప్రోగ్రామ్‌ను రద్దు చేసుకున్నారు. ఫోనుకు కూడా ఆయన దొరకలేదు. దీంతో అజిత్ పవార్ తదుపరి చర్య ఏమిటంటూ మీడియాలో ఊహాగానాలు వెలువడ్డాయి. వీటిపైనే అజిత్ పవార్ శనివారంనాడు మండిపడ్డారు.

''నాకు ఒంట్లో బాగోలేదు. దాంతో శుక్రవారం హాజరుకావాల్సిన కార్యక్రమాలు, పర్యటనలు రద్దు చేసుకున్నాను. గత కొద్ది రోజులుగా మహారాష్ట్ర అంతటా తిరిగాను. తగినంత విశ్రాంతి దొరకలేదు. సరైన నిద్ర లేకపోవడం, ఊపిరితిత్తుల సమస్య ఎక్కువగా ఉంది. వైద్యుల సలహా మేరకు మందులు వేసుకుని ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నాను'' అని అజిత్ పవార్ తెలిపారు. తాము కూడా మనుషులమేనని, ఆరోగ్య సమస్యలు వస్తాయని అన్నారు. ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి వార్తలు రాసినా మీడియా ముందుగా నిర్ధారించుకుని మరీ రాయాలని సూచించారు. తాము ఎప్పుడూ ప్రజల్లో తిరుగుతుంటామని, ఊహాగానాలపై తమ ప్రతిష్టను దిగజార్చరాదని మీడియాకు హితవు పలికారు.

పీఎం విద్యార్హతపై అజిత్ పవార్ ఏమన్నారంటే...?

అజిత్ పవార్ గత ఆదివారం జరిగిన ఒక పబ్లిక్ మీటింగ్‌లో మోదీ విద్యార్హతలకు సంబంధించి మాట్లాడుతూ..''2014లో డిగ్రీ ప్రాతిపదికపై మోదీకి ప్రజలు ఓటు వేశారా? ఆయన ఏర్పరచుకున్న చరిష్మానే ఆయన గెలుపునకు కారణమైంది. ప్రస్తుతం తొమ్మిదేళ్లుగా ఆయన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఆయన డిగ్రీ గురించి ప్రస్తావించడం సరైనది కాదు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలపై నిలదీయవచ్చు'' అని అన్నారు. 2019 నవంబర్‌లో అనూహ్యంగా ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణం చేసినప్పటి నుంచి బీజేపీ పట్ల అజిత్ పవార్‌కు సానుకూల దృక్పధం ఉన్నారనే ప్రచారం ఉంది.

Updated Date - 2023-04-08T16:49:55+05:30 IST