Himant Biswa Sarma: అంబేడ్కర్ చెప్పినదొకటి, కాంగ్రెస్ చేస్తున్నది మరొకటి..!
ABN , First Publish Date - 2023-05-03T15:37:11+05:30 IST
రిజర్వేషన్లు మతం ఆధారంగా ఉండకూడదని, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామని చెబుతోందని అసోం ముఖ్యమంత్రి ..
బెంగళూరు: రిజర్వేషన్లు మతం ఆధారంగా ఉండకూడదని, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామని చెబుతోందని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ (Himanta Biswa Sarma) అన్నారు. బాలాసాహెబ్ అంబేడ్కర్ చాలా స్పష్టంగా మతం ప్రాతిపదికగా రిజర్వేషన్లు కూడదని చెప్పినట్టు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలో ప్రచారం సాగిస్తున్న హిమంత బిస్వ శర్మ బుధవారంనాడు బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో బజరంగ్ దళ్‌పై నిషేధం విధిస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన తప్పుపట్టారు. కాంగ్రెస్ మేనిఫెస్టో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) మేనిఫెస్టోలా ఉందన్నారు.
"పీఎఫ్ఐపై ఇప్పటికే నిషేధం ఉంది. సిద్ధరామయ్య ఆయన హయాంలో పీఎఫ్ఐపై ఉన్న కేసులు ఉపసంహరించారు. ముస్లింలను బుజ్జగించేందుకే పీఎఫ్ఐ, బజరంగదళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెస్ అంటోంది. కాంగ్రెస్ మేనిఫెస్టో పీఎఫ్ఐ, మరికొన్ని మతోన్మాద ముస్లిం సంస్థల మేనిఫెస్టోలా ఉంది'' అని శర్మ అన్నారు.
బజరంగ్‍దళ్, పీఎఫ్ఐ, తదితర సంస్థలపై చట్టం ప్రకారం నిషేధం విధించేందుకు అవసరమైన నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ మంగళవారంనాడు విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. దీనిని అసోం సీఎం తప్పుపట్టారు. యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలుతో ముస్లిం మహిళలకు సమాన హక్కులు, లింగవివక్షకు తావులేని సమన్యాయం సాధ్యమవుతుందన్నారు. తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే కర్ణాటకలో యూసీసీని అమలు చేస్తామని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా యూసీసీ అమలును అంతా కోరుతున్నట్టు ఆన తెలిపారు. దేశవ్యాప్తంగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సీ) అవసరం కూడా ఇప్పుడు ఎంతో ఉందని చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈనెల 10న జరుగనుండగా, 13న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.