Foxconn-Vedanta : కాంగ్రెస్‌కు దుర్వార్త : బీజేపీ

ABN , First Publish Date - 2023-07-12T14:06:10+05:30 IST

భారత దేశం ఆత్మవిశ్వాసంతో ఉండటం, స్వయంసమృద్ధి సాధించడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం ఉండదని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ (Amit Malviya) ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఓ సమగ్ర సెమీకండక్టర్ ప్రోగ్రామ్‌ను రూపొందించినట్లు తెలిపారు.

Foxconn-Vedanta : కాంగ్రెస్‌కు దుర్వార్త : బీజేపీ
Jairam Ramesh, Amit Malaviya

న్యూఢిల్లీ : భారత దేశం ఆత్మవిశ్వాసంతో ఉండటం, స్వయంసమృద్ధి సాధించడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం ఉండదని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ (Amit Malviya) ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) నాయకత్వంలో ఓ సమగ్ర సెమీకండక్టర్ ప్రోగ్రామ్‌ను రూపొందించినట్లు తెలిపారు. డిజైన్, మాన్యుఫ్యాక్చరింగ్, ప్యాకేజింగ్‌లకు సహకరించడం కోసం 50 శాతం ఏకరీతి ప్రోత్సాహకాన్ని కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇది కాంగ్రెస్‌కు దుర్వార్త అని ఎద్దేవా చేశారు.

సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను గుజరాత్‌లో ఏర్పాటు చేసేందుకు తైవానీస్ కంపెనీ ఫాక్స్‌కాన్, వేదాంత చర్చలు జరిపాయి. కానీ ఈ జాయింట్ వెంచర్ కార్యరూపం దాల్చలేదు. దీని నుంచి తాము వైదొలగాలని నిర్ణయించుకున్నామని ఫాక్స్‌కాన్ సోమవారం ప్రకటించింది. తాము వేరుగా సెమీకండక్టర్ యూనిట్‌ను భారత దేశంలో ఏర్పాటు చేసేందుకు దరఖాస్తు చేయాలని భావిస్తున్నామని తెలిపింది. సానుకూల భాగస్వాముల కోసం పరిస్థితిని చురుగ్గా సమీక్షిస్తున్నట్లు తెలిపింది. ఈ యూనిట్‌ను మొదట మహారాష్ట్రలో ఏర్పాటు చేయాలని భావించారు. ఆ తర్వాత ఇది గుజరాత్‌కు మారడంతో ఇది రాజకీయ అస్త్రంగా మారింది.

దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ఈ నెల 10న ఇచ్చిన ట్వీట్‌లో, ఫాక్స్‌కాన్-వేదాంత డీల్ ఇక లేనట్లేనని, కానీ మైక్రాన్ కంపెనీ సెమీకండర్ చిప్ అసెంబ్లీ, ప్యాకేజింగ్, టెస్టింగ్‌ కోసం రంగంలో ఉన్నట్లు కనిపిస్తోందని తెలిపారు. 2.75 బిలియన్ డాలర్ల మొత్తం పెట్టుబడిలో మైక్రాన్ కేవలం 30 శాతం మాత్రమే పెడుతోందని, కేంద్ర ప్రభుత్వం 50 శాతం, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం పెట్టుబడి పెడుతున్నాయని తెలిపారు. ఏ విధంగా చూసినా, అమెరికన్ కంపెనీకి ఇస్తున్న ఈ రాయితీ చాలా చాలా ఎక్కువ అని వ్యాఖ్యానించారు.

జైరామ్ రమేశ్‌ను ఉద్దేశించి బీజేపీ నేత అమిత్ మాలవీయ బుధవారం చాలా సుదీర్ఘమైన ట్వీట్ ఇచ్చారు. చాలా కష్టమైనప్పటికీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని కోరారు. సెమీకండక్టర్ల తయారీ చాలా సంక్లిష్టమైనదని చెప్పారు. ఇది టెక్నాలజీ ఇంటెన్సివ్ సెక్టర్ అని తెలిపారు. దీనికి మూల ధన పెట్టుబడులు అధికంగా అవసరమవుతాయన్నారు. రిస్క్, అభివృద్ధి దశ, తిరిగి చెల్లింపులు వచ్చే సమయం కూడా ఎక్కువేనని, ఈ రంగంలో మార్పులు అత్యంత వేగంగా జరుగుతాయని వివరించారు. అందువల్ల చెప్పుకోదగ్గ స్థాయిలో, స్థిరమైన పెట్టుబడులు అవసరమవుతాయని తెలిపారు. భారత దేశం గతంలో చేసిన ప్రయత్నాలు విజయవంతం కాలేదని, ఎటువంటి సమగ్ర పథకం లేకుండానే ఫ్యాబ్రికేషన్స్‌ను నేరుగా ఏర్పాటు చేయడానికి గతంలో ప్రయత్నాలు జరిగాయని తెలిపారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సమగ్ర సెమీకండక్టర్ ప్రోగ్రామ్‌ను రూపొందించినట్లు తెలిపారు. డిజైన్, మాన్యుఫ్యాక్చరింగ్, ప్యాకేజింగ్‌ల కోసం 50 శాతం ఏకరీతి ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని ఈ పథకం చెప్తోందన్నారు. పరిశోధన, అభివృద్ధి, ప్రతిభ, సామర్థ్య నిర్మాణాలను ఈ ప్రోగ్రామ్ ప్రోత్సహిస్తుందన్నారు. సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ తర్వాత సెమీకండక్టర్ వాల్యూ చైన్‌లో తదుపరి దశ ఔట్‌సోర్స్‌డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ (OSAT) అని తెలిపారు. దీనినే అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్ (ATMP) అని కూడా పిలుస్తారన్నారు. భారత దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్స్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి మరింత వేగవంతమయ్యేందుకు అడుగులు పడుతున్నాయన్నారు.

ఇవి కూడా చదవండి

Former Minister: ఆదాయానికి మించి ఆస్తులు.. మాజీ మంత్రిపై ఛార్జీషీటు దాఖలు

Collegium system : కొలీజియం వ్యవస్థపై సీజేఐ చంద్రచూడ్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - 2023-07-12T14:06:10+05:30 IST