Manipur : ఆయుధాలను అప్పగించండి, లేదా, కఠిన చర్యలు తప్పవు : అమిత్ షా
ABN , First Publish Date - 2023-06-01T14:18:27+05:30 IST
మణిపూర్‌లో జరిగిన విస్తృత హింసాకాండపై విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఓ కమిటీ చేత దర్యాప్తు చేయిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం ప్రకటించారు.
న్యూఢిల్లీ : మణిపూర్‌లో జరిగిన విస్తృత హింసాకాండపై విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఓ కమిటీ చేత దర్యాప్తు చేయిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) గురువారం ప్రకటించారు. హింసాకాండకు సంబంధించిన ఆరు కేసులను ప్రత్యేక సీబీఐ బృందం దర్యాప్తు చేస్తుందని తెలిపారు. అందరూ తమ వద్దనున్న ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో మూడు రోజుల పర్యటన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు.
మణిపూర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రతినిధులతోనూ అనేక విడతల్లో చర్చలు జరిపానని అమిత్ షా గురువారం విలేకర్ల సమావేశంలో తెలిపారు. అధికారులు, రాజకీయ పార్టీలు, కుకీ, మెయిటీ తెగల ప్రజల ప్రతినిధులతో చర్చించానని తెలిపారు. హింసాత్మక సంఘటనలకు కారణాలు, అందుకు బాధ్యులు ఎవరు? అనే అంశాలపై దర్యాప్తు చేసేందుకు ఓ కమిటీని నియమిస్తున్నట్లు తెలిపారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయిగల విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. మణిపూర్ గవర్నర్ మార్గదర్శకత్వంలో శాంతి కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు వివిధ సంస్థలు పని చేస్తున్నాయని, సీఆర్‌పీఎఫ్ రిటైర్డ్ డీజీ కుల్‌దీప్ సింగ్ ఈ సంస్థలను సమన్వయపరుస్తారని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక సీబీఐ బృందం ఆరు కేసులపై దర్యాప్తు జరుపుతుందని తెలిపారు. నిష్పాక్షిక దర్యాప్తు, విచారణ జరుగుతుందని మణిపూర్ ప్రజలకు హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇటువంటి హింసాత్మక సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
హింసాకాండలో ఆత్మీయులను కోల్పోయినవారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.5 లక్షలు చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. ఆయుధాలను కలిగియున్నవారు వెంటనే వాటిని పోలీసులకు అప్పగించాలని ప్రజలను కోరారు. కూంబింగ్ ఆపరేషన్ శుక్రవారం నుంచి ప్రారంభమవుతుందన్నారు. ఎవరి వద్దనైనా అక్రమ ఆయుధాలు కనిపిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. వదంతులు నమ్మవద్దని ప్రజలను, ప్రజా సంఘాలను కోరారు. ఇరు పక్షాలు శాంతియుతంగా వ్యవహరించవలసిన అవసరం ఉందని చెప్పారు.
రాష్ట్ర జనాభాలో 53 శాతం మంది ఉన్న మెయిటీ తెగవారిని షెడ్యూల్డు ట్రైబ్ కేటగిరీలోకి చేర్చాలనే డిమాండ్ ఉంది. దీనిపై పరిశీలించాలని మణిపూర్ హైకోర్టు ఏప్రిల్ 19న ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నిరసన కార్యక్రమాలు, హింసాకాండ మే 3 నుంచి ప్రారంభమయ్యాయి.
ఇవి కూడా చదవండి :
Chanchalguda Jail: చంచల్‌గూడ గేట్.. తాడేపల్లిలో రిమోట్
Gujarat : సముద్రంలో మునిగిపోతున్న ముగ్గుర్ని కాపాడిన బీజేపీ ఎమ్మెల్యే