Nagaland: 'అఫ్‌స్పా' ఎత్తివేత ఎప్పుడంటే..? సంకేతాలిచ్చిన అమిత్‌షా
ABN , First Publish Date - 2023-02-21T14:56:23+05:30 IST
ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌లో వివాదాస్పదంగా మారిన సాయిధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం అమలును కేంద్రం ఎప్పటికప్పుడు పొడిగించుకుంటూ పోతున్న నేపథ్యంలో..
కోహిమా: ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌లో వివాదాస్పదంగా మారిన సాయిధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (AFSPA)అమలును కేంద్రం ఎప్పటికప్పుడు పొడిగించుకుంటూ పోతున్న నేపథ్యంలో దానిపై కేంద్ర హోం మంత్రి స్పష్టత ఇచ్చారు. రాబోయే మూడు, నాలుగేళ్లలో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఎత్తివేసే అవకాశాలున్నాయని అన్నారు. నాగాలాండ్‌లోని ట్యుయెన్సంగ్‌లో మంగళవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్‌షా మాట్లాడుతూ, ఈశాన్య నాగాలాండ్ అభివృద్ధి, హక్కులకు సంబంధించిన కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయని, ఎన్నికల తర్వాత వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. నాగా శాంతి చర్చల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. నాగాలాండ్‌లో శాశ్వత శాంతి నెలకొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకుంటున్న చొరవ సత్ఫలితాలను ఇస్తుందనే ఆశాభావంతో ఉన్నట్టు చెప్పారు. నాగాలండ్ ప్రజలు ఎంతో ఉత్సాహంతో ఎన్‌డీఏకు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని, శాంతి, అభివృద్ధిని ముదుకు తీసుకువెళ్లేందుకు బీజేపీని గెలిపించాలని కోరారు.
హింసాత్మక ఘటనలు 70 శాతం తగ్గాయి
బీజేపీ హయాంలో నాగాలాండ్‌లో హింసాత్మక ఘటనలు 70 శాతం వరకూ తగ్గాయని, భద్రతా బలగాల మరణాలు కూడా 60 శాతం తగ్గాయని చెప్పారు. పౌరుల మరణాలు 83 శాతానికి తగ్గినట్టు తెలిపారు. కాగా, ఏప్రిల్ 2022లో అసోం, నాగాలాండ్, మణిపూర్‌లోని కొన్ని జిల్లాల్లో అఫ్‌స్పాను ఎ్తతివేస్తున్నట్టు అమిత్‌షా ప్రకటించారు. భద్రతా పరిస్థితులు మెరుగుపడటం, తిరుగుబాట్లకు తెరపడేందుకు నిలకడైన ప్రయత్నాలు చేపట్టడం, ఫాస్ట్ ట్రాక్ డవలప్‌మెంట్ వంటివి మెరుగుపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు. కాగా, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 27న జరుగనుంది. మార్చి 2న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.
ఏమిటీ అఫ్‌స్పా చట్టం?
ఘర్షణలు జరిగే ప్రాంతాల్లో శాంతిభద్రతలను కాపాడటం కోసం అఫ్‌స్పా చట్టాన్ని తెచ్చారు. ఇందుకోసం అవసరమైన చర్యలను సాయుధ దళాలు అమలు చేయడానికి ఈ చట్టం అనుమతి ఇస్తుంది. తీవ్రవాదుల శిక్షణ స్థావరాలను ధ్వంసం చేయడం, వారెంట్ లేకుండా వ్యక్తులను అరెస్టు చేయడం వంటి వాటికి ఇది అవకాశం కల్పిస్తుంది. ఈ చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. నాగాలాండ్‌లో ఈ చట్టాన్ని ఉపసంహరించే అంశాన్ని పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని కూడా గత ఏడాది ఏర్పాటు చేసింది.