Satyapal Malik VS Amit shah: సత్యపాల్ మాలిక్ వ్యాఖ్యలపై తొలిసారి స్పందించిన అమిత్‌షా
ABN , First Publish Date - 2023-04-23T13:53:01+05:30 IST
జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కు సీబీఐ సమన్లు జారీ చేయడం, పుల్వామా దాడికి సంబంధించి ఆయన చేసిన..
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (Satya pal Malik)కు సీబీఐ సమన్లు జారీ చేయడం, పుల్వామా దాడికి సంబంధించి ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit shah) కర్ణాటకలో జరిగిన ఓ మీడియా కార్యక్రమంలో తొలిసారి స్పందించారు. సత్యపాల్ పాలిక్ గవర్నర్‌గా ఉన్న సమయంలో జరిగిన బీమా కుంభకోణంలో విచారణలో భాగంగానే ఆయనకు సమన్లు జారీ అయ్యాయని తెలిపారు. ఈ వ్యవహారానికి, బీజేపీపై ఆయన చేసిన విమర్శలకు ఎలాటి సంబంధం లేదని, ప్రజల దగ్గర దాచిపెట్టే పనులేవీ బీజేపీ ప్రభుత్వం చేయదని అన్నారు.
సత్యపాల్ మాలిక్ ఒక ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించడం, ఆ వెంటనే సీబీఐ సమన్లు జారీ చేయడంపై అడిగినప్పుడు... తాను అలా అనుకోవడం లేదని, తనకు తెలిసినంత వరకూ ఆయనకు సీబీఐ సమన్లు జారీ చేయడం ఇది రెండవసారో, మూడవసారో కావచ్చని అన్నారు. బీమా కుంభకోణంపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నందున కొత్త ఆధారాలు ఏవైనా సీబీఐకి లభించి ఉండవచ్చని, అందుకో మాలిక్‌ను పిలిచి ఉంటారని అన్నారు. తమపై వ్యతిరేకంగా మాట్లాడినందుకే ఆయనకు సమన్లు పంపించారనడం సరైనది కాదని చెప్పారు.
పుల్వామా దాడి ఘటనపై మాలిక్ కేంద్రంపై చేసిన సంచలన ఆరోపణలపై మాట్లాడుతూ, తమతో ఉన్నప్పుడు, పదవిలో ఉన్నప్పుడు మాలిక్ ఈ అంశాలను ఎందుకు లేవనెత్తలేదని అమిత్‌షా ప్రశ్నించారు. ఎవరైనా వ్యక్తిగత, రాజకీయ, స్వప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని విమర్శిస్తే దాని వెనుక ఉన్న ఉద్దేశాలను ప్రజలు తెలుసుకోవాలని, పాత్రికేయులు, ప్రజలు ప్రశ్నించాలని అన్నారు. అధికారానికి దూరం కాగానే విమర్శించడం సరైంది కాదన్నారు. మాలిక్ గవర్నర్ పదవిలో ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో మోదీ ప్రభుత్వ పనితీరుపై ఎలాంటి దాపరికం లేకుండా మాట్లాడేవారని, సుదీర్ఘకాలం బీజేపీలో పనిచేసిన అనుభవం ఉన్నందునే బీహార్, జమ్మూకశ్మీర్, గోవా, మేఘాలయకు గవర్నర్‌గా ఆయనను ఎంపిక చేశామని అమిత్‌షా చెప్పారు.