Amritsar: పంజాబ్ పోలీసుల వలలో చిక్కిన 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ సన్నిహితుడు
ABN , Publish Date - Dec 15 , 2023 | 04:40 PM
ఖలిస్థాన్ సానుభూతిపరుడు, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్‌పాల్ సింగ్ సన్నిహత సహచరుడు కుల్వంత్ సింగ్‌ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. కుల్వంత్ సింగ్‌ను శుక్రవారంనాడు కోర్టుకు హాజరుపరిచారమని, కోర్టు నాలుగు రోజుల రిమాండ్‌కు ఆదేశించిందని డీజీపీ అంజలా రిపుతపన్ సింగ్ సంధు తెలిపారు.
అమృత్‌సర్: ఖలిస్థాన్ సానుభూతిపరుడు, 'వారిస్ పంజాబ్ దే' (Waris Punjab De) చీఫ్ అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) సన్నిహత సహచరుడు కుల్వంత్ సింగ్ (Kulwant Singh)ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. కొద్దికాలంగా పరారీలో ఉన్న కుల్వంత్ సింగ్‌ను అరెస్టు చేసి కోర్టు ముందు శుక్రవారం హాజరుపరిచారమని, కోర్టు నాలుగు రోజుల రిమాండ్‌కు ఆదేశించిందని డీజీపీ అంజలా రిపుతపన్ సింగ్ సంధు తెలిపారు. పంజాబ్‌లోని మోగాలో అమృత్‌పాల్ సింగ్‌ను గత ఏప్రిల్‌లో అరెస్టు చేశారు.
కాగా, గత మార్చిలో అమృత్‌పాల్ సింగ్ జలంధర్ సింగ్ జిల్లాలో వాహనాలు మారుస్తూ, మారువేషాల్లో తప్పించుకునే ప్రయత్నం చేయడంతో అతనిని తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిగా పంజాబ్ పోలీసులు ప్రకటించారు. దీనికి ముందు ఫిబ్రవరి 23న అమృత్‌పాల్ మద్దతుదారులు అమృత్‌సర్‌లోని అంజల పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. పంజాబ్ పోలీసులకు చిక్కిన లవ్‌ప్రీత్ తూఫాన్‌ను విడుదల చేయాలనే డిమాండ్‌తో ఈ దాడి జరిగింది. ఈ కేసులో పంజాబ్ పోలీసులు అమృత్‌పాల్ పైన, ఆయన మద్దతుదారులపైన విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడి, హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ పలు కేసులు నమోదు చేశారు.