Amritpal Singh Case: కిరణ్ దీప్ కౌర్‌పై నిఘా.. ఎవరీమె..?
ABN , First Publish Date - 2023-03-22T19:44:20+05:30 IST
పరారీలో ఉన్న ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ ఐదో రోజు కూడా పంజాబ్ పోలీసులతో..
చండీగఢ్: పరారీలో ఉన్న ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) ఐదో రోజు కూడా పంజాబ్ పోలీసులతో దాగుడుమూతలాడున్నాడు. తన సన్నిహిత సహచరులైన పాపల్ సింగ్, విక్రమ్‌జీత్ సింగ్‌తో కలిసి, వేషధారణ మార్చుకుంటూ రాత్రుల్లో రహస్యంగా తిరుగుతున్నట్టు చెబుతున్నారు. షెడ్యూల్ ప్రకారం ముక్తసార్ సాహిబ్‌లో అమృత్‌పాల్ పర్యటించాల్సి ఉన్నందున అక్కడే ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే సమయంలో మరో కొత్తకోణం కూడా వెలుగుచూసింది. అమృత్‌పాల్ ఎన్ఆర్ఐ (NRI) భార్య కిరణ్‌దీప్ కౌర్‌కు (Kirandeep Kaur) ఖలిస్థాన్ సంస్థతో, విదేశీ నిధులతో సంబంధం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెపై డేగ కన్ను వేసినట్టు తెలుస్తోంది. అమృతపాల్ స్వగ్రామమైన జల్లుపూర్ ఖెరాలో ఆమెను పోలీసులు బుధవారంనాడు ప్రశ్నించారు.
ఎవరీ కిరణ్ దీప్ కౌర్?
లండన్‌లో ఉంటున్న ఎన్ఆర్ఐ కిరణ్‌దీప్ కౌర్ ఇటీవలనే అమృత్‌పాల్‌ను పెళ్లాడింది. జల్లుపూర్ ఖెరా గ్రామంలోనే గత నెలలో వీరిద్దరికీ పెళ్లయింది. తన భార్య తనతో ఉండేందుకు పంజాబ్ వచ్చేస్తుందని కూడా వివాహానంతరం అమృత్‌పాల్ ప్రకటించారు. కిరణ్ దీప్ కౌర్ కుటుంబసభ్యులు జలంధర్‌కు చెందినవారుగా తెలుస్తోంది.
కాగా, పోలీసులకు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వని పక్షంలో ఆమెను అరెస్టు చేసే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది. యూకేతో ఆమెకున్న సంబంధాలు ఇందుకు ఒక కారణంగా చెబుతున్నారు. యూకేలో ఇటీవల ఖలిస్థాన్ కార్యకలాపాలు వెలుగుచూశాయి. ఈ క్రమంలో పోలీసులు కిరణ్ దీప్ కౌర్ గురించి బ్రిటన్‌లోని ఆమె మిత్రులు, కుటుంబసభ్యుల నుంచి సమాచారం రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
మరోవైపు, అమృత్‌పాల్ ఏ బైక్‌లో పరారవుతూ కనిపించాడో ఆ బైక్‌ను జలంధర్‌కు 45 కిలోమీటర్ల దూరంలోని దారాపూర్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రోడ్లు పక్కన ఎవరో దానిని వదిలేసి వెళ్లనట్టు గుర్తించారు. గాలింపు చర్యల్లో భాగంగా జల్లుపూర్ ఖేర్ గ్రామంలోని అమృత్‌పాల్ నివాసానికి పంజాబ్ పోలీసులు బుధవారంనాడు వెళ్లారు. కిరణ్ దీప్ సింగ్‌తో సహా పలువురిని ప్రశ్నిస్తున్నారు.