Share News

Amritsar: గోల్డెన్ టెంపుల్ డొనేషన్ కౌంటర్‌ నుంచి రూ.లక్ష దొంగతనం

ABN , First Publish Date - 2023-11-28T17:41:32+05:30 IST

పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయం డొనేషన్ కౌంటర్ నుంచి ఆగంతకులు లక్ష రూపాయలు దొంగిలించినట్టు గుర్తించారు. గురునానక్ జయంతి ముందు రోజు శనివారంనాడు ఈ దొంగతనం జరిగింది. జయంతి సన్నాహాలు జరుగుతుండగా సందిట్లో సడేమియా అన్నట్టు ఆగంతకులు ఈ చోరీకి పాల్పడినట్టు తెలుస్తోంది.

Amritsar: గోల్డెన్ టెంపుల్ డొనేషన్ కౌంటర్‌ నుంచి రూ.లక్ష దొంగతనం

అమృత్‌సర్: పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయం (Golden Temple) డొనేషన్ కౌంటర్ నుంచి ఆగంతకులు లక్ష రూపాయలు దొంగిలించినట్టు గుర్తించారు. గురునానక్ జయంతి (Gurpurab) ముందు రోజు శనివారంనాడు ఈ దొంగతనం జరిగింది. జయంతి సన్నాహాలు జరుగుతుండగా సందిట్లో సడేమియా అన్నట్టు ఆగంతకులు ఈ చోరీకి పాల్పడినట్టు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన ఆలయ నిర్వాహకులు కేసు నమోదు చేశారని, నలుగురు అనుమానితులు ఈ దొంగతనానికి పాల్పడినట్టు దర్యాప్తు అధికారులకు ఫిర్యాదు చేశారని సమాచారం.


డొనేషన్ కౌంటర్ నుంచి సొమ్ము దోచుకున్న ఘటనలో నలుగురి ప్రమేయం ఉన్నట్టు మీడియా కథనాలు చెబుతున్నాయి. నలుగురు వ్యక్తులు ఆలయ ఆవరణలోకి అడుగుపెడుతుండటం సీసీటీవీలో రికార్డయింది. ఆలయ సంక్షేమ కార్యక్రమాలకు భక్తుల ఇచ్చిన విరాళాలను చేజిక్కించుకుని నిందితులు పరారైనట్టు చెబుతోంది. సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులకు అందజేశారని, నలుగురు అనుమానితుల్లో ఒకరు డొనేషన్ కౌంటర్ వద్ద రసీదులను చించుతూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేశాడని ఆ ఫుటేజ్‌లో కనిపిస్తోంది. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే, దీనిపై ఆలయ యాజమాన్యం మాత్రం ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Updated Date - 2023-11-28T17:41:34+05:30 IST