Another Pee gate incident: రైలు ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. టీటీఈ నిర్వాకం

ABN , First Publish Date - 2023-03-14T16:08:23+05:30 IST

విమానాల్లో మూత్ర విసర్జన ఘటనలు ఇటీవల కొన్ని వెలుగుచూసిన క్రమంలో తాజాగా ఇదే తరహా ఘటన ఒక రైలులో..

Another Pee gate incident: రైలు ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. టీటీఈ నిర్వాకం

లక్నో: విమానాల్లో సాటి ప్రయాణికులపై మూత్ర విసర్జన (Pee gate) ఘటనలు ఇటీవల కొన్ని వెలుగుచూసిన క్రమంలో తాజాగా ఇదే తరహా ఘటన ఒక రైలులో చోటుచేసుకుంది. తాగిన మత్తులో ట్రావిలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE) రైలులో ప్రయాణిస్తున్న ఒక మహిళపై మూత్రవిసర్జన చేసినట్టు ఆరోపణలు రావడంతో అతన్ని అరెస్టు చేశారు. అమృత్‌సర్-కోల్‌కతా మధ్య నడిచే అకల్ తఖ్త్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారంనాడు ఈ ఘటన చోటుచేసుకుంది. టీటీఈ మూత్రవిసర్జన చేసిన సమయంలో ఆమె తన బెర్త్‌పై నిద్రపోతోంది.

రైలు లక్నో సమీపిస్తుండగా టీటీఈ ఆమెపై మూత్రవిసర్జన చేయడంతో ఆమె బిగ్గరగా కేకలు వేసింది. దాంతో ఆమె భర్త రాజేష్ వెంటనే టీటీఈని పట్టుకుని దేహశుద్ధి చేశాడు. అనంతరం రైలు లక్నో చేరుకోగానే టీటీఈని రైల్వే పోలీసులకు అప్పగించారు. నిందితుడిని బీహార్‌కు చెందిన మున్నా కుమార్‌గా గుర్తించారు. తన భార్యపై మూత్రవిసర్జన చేశాడంటూ బాధితురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీటీఈని రైల్వై పోలీసులు కస్టడీలోకి తీసుకున్నట్టు జీఆర్‌పీ ఛార్‌బాగ్ రైల్వే స్టేషన్ ఇన్‌చార్జి తెలిపారు.

రెండు నెలల క్రితం ఇదే తరహా ఘటన ఒక విమానంలో చోటుచేసుకుంది. తాగిన మైకంలో ఒక వ్యక్తి తన పక్క సీటులో కూర్చున్న మహిళపై మూత్ర విసర్జన చేశాడు. నిందితుడు శంకర్ మిశ్రాను అరెస్టు చేసి, నాలుగు నెలల పాటు అతని విమాన ప్రయాణాలపై నిషేధం విధించారు. అనంతరం అమెరికల్ ఎయిర్ లైన్‌లో కూడా ఇదే తరహా ఘటన చోటుచేసుకోవడంతో నిందితుడిని ఐజీఐ ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు.

Updated Date - 2023-03-14T16:40:36+05:30 IST