WCD Officer Suspend: రేపిస్టు అధికారిపై కేజ్రీవాల్ సస్పెన్షన్ వేటు

ABN , First Publish Date - 2023-08-21T15:30:02+05:30 IST

తన స్నేహితుడి 14 ఏళ్ల కూతురిపై కొద్ది నెలలుగా అత్యాచారం చేస్తూ గర్భవతిని చేశాడన్న ఆరోపణలపై ఢిల్లీ ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ శాఖలో పనిచేసే సీనియర్ అధికారిని సస్పెండ్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారంనాడు ఆదేశించారు. దీనిపై సాయంత్రం 5 గంటల్లోగా తనకు నివేదిక ఇవ్వాలని కూడా చీఫ్ సెక్రటరీని అడిగారు.

WCD Officer Suspend:  రేపిస్టు అధికారిపై కేజ్రీవాల్ సస్పెన్షన్ వేటు

న్యూఢిల్లీ: తన స్నేహితుడి 14 ఏళ్ల కూతురిపై కొద్ది నెలలుగా అత్యాచారం చేస్తూ గర్భవతిని చేశాడన్న ఆరోపణలపై ఢిల్లీ ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ శాఖ (WCD)లో పనిచేసే సీనియర్ అధికారిని సస్పెండ్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సోమవారంనాడు ఆదేశించారు. దీనిపై సాయంత్రం 5 గంటల్లోగా తనకు నివేదిక ఇవ్వాలని కూడా చీఫ్ సెక్రటరీని ఆదేశించారు.


''అధికారి చాలా నీచమైన పనికి పాల్పడ్డాడు. ఈ నేరానికి అతని భార్య కూడా సహకరించింది. సమాజాన్ని కుదిపివేసే ఘటన ఇది. సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆ అధికారిని సస్పెండ్ చేస్తూ సీఎం ఆదేశాలిచ్చారు. చీఫ్ సెక్రటరీని కూడా సాయంత్రం లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ కేసులో అధికారిని అరెస్టు చేయడంలో పోలీసుల వైఫల్యం చాలా ఘోరం. అందరికీ కూతుళ్లు ఉంటారు. ఇది చాలా సిగ్గుచేటైన వ్యవహారం. చట్టప్రకారం అధికారికి గరిష్ట స్థాయిలో శిక్ష పడాలి'' అని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ అన్నారు.


పూర్వాపరాలు...

బాధితురాలి తండ్రి 2020 అక్టోబర్ 1న చనిపోయాడు. దాంతో అతడి స్నేహితుడైన మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి బాలిక బాగోగులు చూసుకుంటానంటూ తన ఇంటికి తీసుకెళ్లాడు. 2020 నవంబర్-2021 జనవరి మధ్య పలుమార్లు ఆమెపై అతను అత్యాచారం జరిపినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన అతడి భార్య కూడా సహకరించింది. గుట్టుచప్పుడు కాకుండా గర్భనిరోధక మాత్రలు ఇచ్చి బాలికకు అబార్షన్‌ అయ్యేలా చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోక్సో చట్టంతో పలు సెక్షన్ల కింద ఇద్దరిపై కేసు నమోదైంది. ఇటీవల అనారోగ్యానికి గురై స్థానిక ఆస్పత్రిలో చేరిన బాధితురాలు గతంలో తనపై జరిగిన దారుణాన్ని అక్కడికి కౌన్సిలర్‌కు వివరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. స్నేహితుడి కుమార్తెను రక్షిస్తానని చెప్పిన భక్షకుడిగా మారిన నిందితుడిని తక్షణం అరెస్టు చేయాలని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ఒక ట్వీట్‌లో డిమాండ్ చేశారు.

Updated Date - 2023-08-21T16:05:12+05:30 IST