Manipur: పథకం ప్రకారమే మణిపూర్‌ హింస

ABN , First Publish Date - 2023-08-01T03:21:32+05:30 IST

మణిపూర్‌(Manipur)లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై సుప్రీంకోర్టు(Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Manipur: పథకం ప్రకారమే  మణిపూర్‌ హింస

మహిళలను నగ్నంగా ఊరేగించడం భయానక ఘటన

అది నిర్భయ తరహాలో జరిగిన ఒంటరి ఘటన కాదు

ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు అన్ని రోజులు ఎందుకు పట్టింది?

కేసు దర్యాప్తుపై పర్యవేక్షణకు రిటైర్డ్‌ మహిళా జడ్జిలు,

సబ్జెక్ట్‌ నిపుణులతో కమిటీ / సిట్‌ ఏర్పాటు చేస్తాం: సుప్రీం

మణిపూర్‌ పోలీసులపై తీవ్ర ఆగ్రహం.. ప్రశ్నల వర్షం

న్యూఢిల్లీ, జూలై 31: మణిపూర్‌(Manipur)లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై సుప్రీంకోర్టు(Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాన్నో భయానకమైన ఘటనగా అభివర్ణించింది. విద్వేషంతో రగిలిపోతున్న మూకకు ఆ మహిళలను అప్పగించిన రాష్ట్ర పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని తాము కోరుకోవట్లేదని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌(DY Chandrachud) నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసు దర్యాప్తుపై పర్యవేక్షణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని లేదా రిటైర్డ్‌ మహిళా న్యాయమూర్తులతో కూడిన కమిటీనిఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది. మణిపూర్‌ హింసపై దాఖలైన పలు పిటిషన్లను మంగళవారం విచారిస్తామని పేర్కొంది. ‘‘మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన మే 4న జరిగితే.. జీరో ఎఫ్‌ఐఆర్‌(Zero FIR) దాఖలైంది మే 18న. ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయడానికి పోలీసులకు 14 రోజులు ఎందుకు పట్టింది’’ అని నిలదీసింది.

ఘటన జరిగిన రోజే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి పోలీసులకు ఉన్న ఇబ్బంది ఏంటని.. మణిపూర్‌ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్‌ జనరల్‌(ఎస్జీ) తుషార్‌ మెహతాను జస్టిస్‌ చంద్రచూడ్‌ ప్రశ్నించారు. ఈ ఘటన మే 18న పోలీసుల దృష్టికి వచ్చిందని.. వెంటనే వారు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని, వీడియో బయటపడ్డ 24 గంటల్లోనే ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేశారని ఎస్జీ కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తుపై తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని ఆయన తేల్చిచెప్పారు. ఇక.. మణిపూర్‌లో జరుగుతున్న హింసకు సంబంధించి ఇప్పటిదాకా ఎన్ని ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని సీజేఐ ప్రశ్నించగా.. ఈ ఘటనకు జరిగిన పరిధిలోని పోలీ్‌సస్టేషన్‌లో 20, మణిపూర్‌వ్యాప్తంగా 6000 ఎఫ్‌ఐఆర్‌లు దాఖలైనట్టు ఎస్జీ వెల్లడించారు. ఆ వివరాలు విన్న సీజేఐ.. పోలీసులపై తీవ్రవ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ ఘటన జరిగిన విషయం ఆ రోజు స్థానిక పోలీసులకు తెలియదా? మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ను మే 18న నమోదు చేసి.. దాన్ని మేజిస్ట్రేట్‌కు నెలరోజుల తర్వాత జూన్‌ 20న బదిలీ చేశారు. ఎందుకు అంత సమయం పట్టింది?’’ అని ప్రశ్నించారు. అంతేకాదు.. ‘‘మొత్తం 6000 ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్టు మీరు (ఎస్జీ) చెబుతున్నారు.

అందులో ఏ కేసులు ఎన్ని? ఎంతమంది మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు? ఎంతమంది హత్య, గృహదహనాల వంటి తీవ్రనేరాలకు పాల్పడ్డారు’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘ఆ 6000 ఎఫ్‌ఐఆర్‌ల వివరాలు వేర్వేరుగా కావాలి. ఏ కేసులు ఎన్ని? వాటిలో జీరో ఎఫ్‌ఐఆర్‌లు ఎన్ని? ఎన్నింటిని సంబంధిత పోలీ్‌సస్టేషన్‌కు పంపారు? ఎన్నింటిపై చర్యలు తీసుకున్నారు? తదితర వివరాలు కావాలి’’ అని స్పష్టం చేశారు. బాధితులకు ఎలాంటి సహాయ, పునరావాస ప్యాకేజీని ప్రకటించారో కూడా చెప్పాలన్నారు. ఆ వివరాలన్నీ తనవద్ద లేవని ఎస్జీ బదులివ్వడంపై సీజేఐ విస్మయం వ్యక్తం చేశారు. మంగళవారం విచారణకు ఈ వివరాలతో రావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. మే 4న జరిగిన ఘటన ఏదో ఆవేశంలో జరిగిన ఒక ఘటన కాదని.. మణిపూర్‌లో ఒక పథకం ప్రకారం జరుగుతున్న హింసలో భాగమేనని కటువుగా వ్యాఖ్యానించారు. ‘‘ఆ మూకకు పోలీసులే తమను అప్పగించినట్టు బాధితులు చెప్పిన వాంగ్మూలాలు ఉన్నాయి. ఇది ‘నిర్భయ’ తరహా ఘటన కాదు. మణిపూర్‌లో పద్ధతి ప్రకారం జరుగుతున్న హింసతో మనం డీల్‌ చేస్తున్నాం. దాన్ని ఎదుర్కోవడానికి మీకు ప్రత్యేక బృందం ముఖ్యం కాదా?’’ అని నిలదీశారు. కాగా.. ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి కొంత సమయం కావాలని అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకట రమణి అడిగారు. దీనికి ధర్మాసనం.. సమయం మించిపోతోందని, తమ ఆప్తులను, సర్వస్వాన్నీ కోల్పోతున్న ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.


ఆడపిల్లలందరికీ రక్షణ కావాలి

ప్రతివాదుల్లో ఒకరి తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది బాన్సురి స్వరాజ్‌.. పశ్చిమబెంగాల్‌లో జరిగిన ఇదే తరహా ఘటనను ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఆ అంశాన్ని కూడా విచారణకు స్వీకరించాలని కోర్టును కోరుతూ.. దేశంలోని ఆడపిల్లలందరికీ రక్షణ కావాలని వ్యాఖ్యానించారు. దీనికి సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ స్పందించారు. ‘‘నిస్సందేహంగా దేశవ్యాప్తంగా మహిళలపై నేరాలు జరుగుతున్నాయి. ఇది సామాజిక వాస్తవం. కానీ, ఇక్కడ మనం.. మతపరమైన, తెగపరమైన ఘర్షణల్లో భాగంగా మహిళలపై మునుపెన్న డూ జరగనంత స్థాయిలో జరుగుతున్న నేరాలు, హింసతో డీల్‌ చేస్తున్నాం. దేశంలోని అన్ని ప్రాంతాల్లో మహిళలపై నేరాలు జరుగుతున్నాయన్న వాస్తవంతో మేం విభేదించట్లేదు. అయితే.. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి నేరాలు జరుగుతున్నాయన్న సాకు చూపి మణిపూర్‌లో ప్రస్తుతం జరుగుతున్న హింసను క్షమించలేం. ఇప్పుడు మనముందున్న ప్రశ్న.. మణిపూర్‌లో జరుగుతున్న దాన్ని ఎలా ఆపాలి? దీనిపై మీరేమైనా సూచనలు ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి’’ అని సీజేఐ సమాధానమిచ్చారు. దీనికి బాన్సురీ స్వరాజ్‌.. ‘‘పశ్చిమబెంగాల్‌, రాజస్థాన్‌, ఛత్తీ్‌సగఢ్‌, కేరళ.. ఇలా అన్నిచోట్లా ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి ఈ దేశపు ఆడపిల్లలందరినీ కాపాడండి. కేవలం మణిపూర్‌కే పరిమితం కాకండి’’ అని అభ్యర్థించగా.. ‘‘రక్షిస్తే ఆడపిల్లలందరినీ రక్షించండి లేకుంటే ఎవ్వరినీ రక్షించవద్దని మీరు చేబుతున్నారా?’’ అని సీజేఐ ప్రశ్నించారు.

సీబీఐపై నమ్మకం లేదు: సిబల్‌

మణిపూర్‌లో మే 4న జరిగిన దారుణంలో బాధితులైన ఇద్దరు మహిళల తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి, విచారణను అసోంకు తరలించాలన్న కేంద్రం ప్రతిపాదనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఆరోజు మహిళలను నగ్నంగా ఉరేగించిన దుర్మార్గులతో పోలీసులు కుమ్మక్కయ్యారని.. వారే బాధిత మహిళలను అల్లరి మూకకు అప్పగించారని కోర్టుకు తెలిపారు. బాధిత మహిళల్లో ఒకరి తండ్రిని, సోదరుడిని కూడా వారు చంపేశారని.. ఆ ఇద్దరి శవాలు ఇప్పటికీ దొరకలేదని అన్నారు. నేరగాళ్లతో కుమ్మక్కయిన మణిపూర్‌ పోలీసులు అందించే వివరాలపై ఎలా ఆధారపడగలమని ప్రశ్నించారు.

Updated Date - 2023-08-01T03:21:32+05:30 IST