Gyanvapi : జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఏఎస్ఐ సైంటిఫిక్ సర్వే పునఃప్రారంభం
ABN , First Publish Date - 2023-08-05T11:02:13+05:30 IST
ఉత్తర ప్రదేశ్‌లోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (Archaeological Survey of India-ASI) సైంటిఫిక్ సర్వే రెండో రోజు శనివారం ఉదయం పునఃప్రారంభమైంది. ఈ సర్వేకు ముస్లిం పక్షం కూడా హాజరైంది. ఏఎస్ఐ అధికారులు ఐదు బృందాలుగా విడిపోయి సర్వే చేస్తున్నారు.
వారణాసి : ఉత్తర ప్రదేశ్‌లోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (Archaeological Survey of India-ASI) సైంటిఫిక్ సర్వే రెండో రోజు శనివారం ఉదయం పునఃప్రారంభమైంది. ఈ సర్వేకు ముస్లిం పక్షం కూడా హాజరైంది. ఏఎస్ఐ అధికారులు ఐదు బృందాలుగా విడిపోయి సర్వే చేస్తున్నారు. 17వ శతాబ్దంనాటి ఈ మసీదును అంతకుముందే నిర్మితమైన హిందూ దేవాలయంపై నిర్మించారా? అనే అంశం ఈ సర్వేతో తేటతెల్లమవుతుంది.
ఈ మసీదులో సైంటిఫిక్ సర్వేను అడ్డుకునేందుకు ముస్లిం పక్షం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సుప్రీంకోర్టు కూడా సైంటిఫిక్ సర్వే చేయడానికి అనుమతించడంతో, ముస్లిం పక్షం రెండో రోజు సర్వేలో పాల్గొంటామని ప్రకటించింది. జమాత్ కమిటీ సంయుక్త కార్యదర్శి సయ్యద్ మహమ్మద్ యాసిన్ మాట్లాడుతూ, ఈ సర్వే తొలి రోజు తాము హాజరు కాకపోవడానికి కారణం ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతుండటమేనని చెప్పారు. సైంటిఫిక్ సర్వేను నిలిపేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించినందువల్ల తమ కమిటీ ఈ సర్వేకు సహకరిస్తుందని తెలిపారు. శుక్రవారం ఏఎస్ఐ అధికారులు నిర్వహించిన సర్వేకు ముస్లిం పక్షం హాజరు కాలేదు.
ఏఎస్ఐ అధికారులు రాడార్ టెక్నాలజీతో ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ఇది శనివారం మధ్యాహ్నం 12.30 గంటల వరకు, భోజన విరామం తర్వాత 2.30 గంటల నుంచి 5.00 గంటల వరకు జరుగుతుంది. శుక్రవారం ఏడు గంటలపాటు జరిగిన సర్వేలో ఈ మసీదు సముదాయంలోని బయటి, లోపలి భాగాలను వీడియో, ఫొటో చిత్రీకరణ జరిగింది. లేఅవుట్, భవన నిర్మాణ చిత్రాలను చిత్రీకరించడానికే ఎక్కువ సమయం పట్టింది. ఏఎస్ఐ అధికారులు 37 మంది, నలుగురు ఐఐటీ నిపుణుల బృందం తొలి రోజు సర్వేలో పాల్గొన్నారు. వీరు నాలుగు బృందాలుగా విడిపోయి సర్వే చేశారు.
ముస్లిం పక్షం హాజరు
రెండో రోజైన శనివారం జరుగుతున్న సర్వేకు ముస్లిం పక్షం నుంచి ఐదుగురు ప్రతినిధులు, ఇరు పక్షాల న్యాయవాదులు పాల్గొన్నారు. ఏఎస్ఐ అధికారులు ఐదు బృందాలుగా విడిపోయి సర్వే చేస్తున్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాలు
మసీదులో సైంటిఫిక్ సర్వే నిర్వహించాలని వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలపై అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది. జిల్లా కోర్టు ఆదేశాలను హైకోర్టు గురువారం సమర్థించింది. వెంటనే మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సర్వేను నిలిపేయాలని కోరింది. నిర్మాణాలకు ఎటువంటి నష్టం జరగకుండా సైంటిఫిక్ సర్వే చేయవచ్చునని సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. అయితే మసీదు ప్రాంగణంలో సైంటిఫిక్ సర్వేను ఏఎస్ఐ అధికారులు అంతకుముందే ప్రారంభించారు.
హిందూ పక్షం తరపు న్యాయవాది సుధీర్ త్రిపాఠీ మీడియాతో మాట్లాడుతూ, సర్వేలో అన్ని పక్షాలు పాల్గొనాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. దీనిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. తాము సంపూర్ణంగా సహకరిస్తున్నామని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముస్లిం పక్షం తరపున ప్రతినిధులు హాజరవుతున్నారని, తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈ అంశానికి త్వరగా పరిష్కారం లభించాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. సర్వే పూర్తయితే అన్ని విషయాలు స్పష్టమవుతాయని చెప్పారు.
మరోవైపు ఈ సర్వేకు గడువు శుక్రవారం ముగిసింది. వారణాసి కోర్టు ఈ గడువును మరో నెల వరకు, అంటే సెప్టెంబరు 4 వరకు పొడిగించింది.
ఇవి కూడా చదవండి :
Supervision of IIMs: ఐఐఎంల పర్యవేక్షణ అధికారం రాష్ట్రపతికి