Assam : పెద్ద ఎత్తున మతం మారిన గిరిజనులు

ABN , First Publish Date - 2023-02-28T17:50:54+05:30 IST

అస్సాంలోని గిరిజనులు దైవారాధన, సంప్రదాయాలు, ఆచారాల విషయంలో తమ మూలాలకు తిరిగి చేరుకుంటున్నారు.

Assam : పెద్ద ఎత్తున మతం మారిన గిరిజనులు
Assam

న్యూఢిల్లీ : అస్సాంలోని గిరిజనులు దైవారాధన, సంప్రదాయాలు, ఆచారాల విషయంలో తమ మూలాలకు తిరిగి చేరుకుంటున్నారు. తమ పూర్వీకులంతా హిందూ మతంలోనే ఉండేవారని గుర్తించి, తిరిగి అదే మతంలోకి మారిపోతున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sharma) మాట్లాడుతూ, సంస్కృతి, గుర్తింపు విషయంలో మూలాలకు అంటిపెట్టుకుని ఉండాలని, మతం మారే ధోరణికి దూరంగా ఉండాలని కోరడంతో గిరిజనుల్లో ఆలోచన ప్రారంభమైంది.

అస్సాంలోని మోరిగావ్ జిల్లా, తీవా (Tiwa) గిరిజనులను ఉద్దేశించి హిమంత ఇచ్చిన పిలుపుతో 24 గిరిజన క్రైస్తవ కుటుంబాలు సోమవారం తిరిగి హిందూ మతంలోకి మారాయి. గోవా (తీవా) రాజ దర్బారులో నిర్వహించిన సంప్రదాయ కార్యక్రమంలో వీరంతా హిందూ మతంలోకి మారిపోయారు. అస్సాంలోని నెల్లీ నుంచి కర్బి అంగ్లాంగ్‌కు వెళ్లే మార్గంలో ఉన్న మోర్టాన్ అనే గ్రామంలో ఈ కార్యక్రమం జరిగింది.

తీవా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో తీవా ట్రెడిషన్ నిర్వహించిన మరొక కార్యక్రమంలో 11 కుటుంబాలకు చెందిన 43 మంది క్రైస్తవాన్ని వదిలిపెట్టి, హిందూ మతంలోకి మారిపోయారు. వీరు ఇటీవలే క్రైస్తవంలోకి వెళ్ళిన విషయం గమనార్హం. వీరంతా గోవా రాజ దర్బారులో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని, దేవీదేవతలకు ప్రత్యేక ప్రార్థనలు చేసి, తిరిగి హిందూ మతంలోకి ప్రవేశించారు.

గోవా దేవ్‌రాజా పరిషత్తు సభ్యుడు బోర్డోలాయ్ మాట్లాడుతూ, గతంలో ఇతర మతాల్లోకి వెళ్లినవారిని వారి సమ్మతితోనే తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడానికి తీవా లాంగ్వేజ్ కల్చర్, ఉద్ధార్ పర్బా సంస్థ కృషి చేస్తున్నట్లు తెలిపారు. తమ సంస్థ కామరూప్, కర్బి అంగ్లాంగ్‌లలో రెండు గ్రామాలను వారి సమ్మతితోనే తిరిగి హిందూ మతంలోకి మార్చినట్లు తెలిపారు. తీవా దేవతను ఆరాధిస్తామని, తీవా విశ్వాసాలను, ఆచారాలను నమ్ముతామని, తిరిగి క్రైస్తవంలోకి మారబోమని వీరంతా హామీ ఇచ్చినట్లు తెలిపారు. మతమార్పిడి ముఠాల గురించి తమకు చాలా కాలం క్రితం నుంచి తెలుసునని చెప్పారు. హిందూ మతాన్ని గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను ధ్వంసం చేయడానికి ఈ ముఠాలు పని చేస్తాయని చెప్పారు. కుట్రల పట్ల అప్రమత్తంగా ఉంటూ, తమ ప్రాంతంలోని జాతిని, మతాన్ని కాపాడుకోవడం తప్పనిసరి అని తెలిపారు.

ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అస్సాంలోని జుంగల్ బోలోహు, నాగావ్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఓ సహజసిద్ధ స్థానిక జాతి తన సంస్కృతి మూలాలతో సంబంధాలను కోల్పోతే, దాని మనుగడ కొనసాగడం సాధ్యం కాదని చెప్పారు.

ఇవి కూడా చదవండి :

PM Modi : విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో పెను మార్పులు : మోదీ

United Nations : నిత్యానంద దేశం ‘కైలాస’ ప్రతినిధి ఐరాస సమావేశానికి హాజరు!

Updated Date - 2023-02-28T17:50:54+05:30 IST