Chandrayaan-3 : తిండి, నిద్ర, జీవనం చంద్రయాన్-3యే : ఇస్రో టీమ్
ABN , First Publish Date - 2023-08-23T19:30:18+05:30 IST
చంద్రయాన్-3 విజయవంతమవడంతో ప్రపంచ చరిత్రలో భారత దేశ సువర్ణ అధ్యాయం ప్రారంభమైంది. ప్రతి భారతీయునికి గర్వకారణంగా నిలిచే ఈ విజయం యావత్తు మానవాళికి చెందుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.
న్యూఢిల్లీ : చంద్రయాన్-3 విజయవంతమవడంతో ప్రపంచ చరిత్రలో భారత దేశ సువర్ణ అధ్యాయం ప్రారంభమైంది. ప్రతి భారతీయునికి గర్వకారణంగా నిలిచే ఈ విజయం యావత్తు మానవాళికి చెందుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ విజయానికి ప్రత్యక్ష కారకులైన ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. అదే విధంగా యావద్భారతావని ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తోంది.
చంద్రయాన్-3 విజయవంతమైన వెంటనే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో ఇచ్చిన ట్వీట్‌లో, భారతీయులందరినీ అభినందించింది.
‘‘చంద్రయాన్-3 మిషన్ : ‘భారత దేశమా, నేను నా గమ్య స్థానాన్ని చేరుకున్నాను, నువ్వు కూడా!’’ అని ఇస్రో ట్వీట్ చేసింది. చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రునిపై సున్నితంగా దిగిందని తెలిపింది. భారత దేశానికి అభినందనలు తెలిపింది.
ముందుగా ప్రకటించినట్లుగానే..
విక్రమ్ ల్యాండర్ ఇస్రో ప్రకటించిన షెడ్యూలుకు అనుగుణంగానే బుధవారం సాయంత్రం 6.04 గంటలకు చంద్రునిపై అడుగు పెట్టింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టిన మొదటి దేశం భారత దేశమే కావడం విశేషం.
ఇస్రో చీఫ్ స్పందన
ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రయాన్-3 మిషన్ ప్రయోగం సమయంలో అత్యంత సంక్లిష్ట సమయాన్ని ఎదుర్కొన్నామని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనతో మాట్లాడుతూ, అంతరిక్ష పరిశోధనలు, సైన్స్ రంగంలో భారత దేశం ఆధిక్యంలో ఉండాలని చెప్పారన్నారు. చంద్రయాన్-3కి ప్రపంచవ్యాప్తంగా అనేక గ్రౌండ్ స్టేషన్స్ నుంచి సహకారం లభించిందన్నారు. వాటి నుంచి తమకు ప్రత్యక్షంగా ఎప్పటికప్పుడు సమాచారం అందిందని చెప్పారు. చౌక ధరకు ఇటువంటి మిషన్‌ను నిర్వహించగలిగేది కేవలం భారత దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ మాత్రమేనని చెప్పారు. చంద్రయాన్-3లోని ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వస్తుందని, ఉత్కంఠభరితమైన తదుపరి 14 రోజుల ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. ఇది సువర్ణాధ్యాయానికి నాంది అని తెలిపారు. చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టిన వెంటనే ప్రధాని మోదీ తనకు ఫోన్ చేసి, అభినందించారని తెలిపారు.
సూర్యుడిని అధ్యయనం చేయడం కోసం ఆదిత్య ఎల్1 మిషన్‌ను వచ్చే నెలలో ప్రయోగిస్తామని చెప్పారు. దీని గురించి మన దేశంలో ఉన్న ఉత్కంఠత గురించి తాను వర్ణించలేనని చెప్పారు. దీనికి సంబంధించిన ప్రణాళిక సజావుగా జరుగుతోందని తెలిపారు. భూమిపై నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని చేరుకోవడానికి 120 రోజులు పడుతుందన్నారు. గగన్‌యాన్ అబార్ట్ మిషన్ సెప్టెంబరు నెలాఖరులో కానీ, అక్టోబరు మొదటి వారంలో కానీ జరుగుతుందన్నారు.
ఇస్రో మాజీ చీఫ్ స్పందన
ఈ క్షణాల కోసం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నామని ఇస్రో మాజీ చీఫ్ కే శివన్ చెప్పారు. తాను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు.
తిండి, నిద్ర, జీవనం చంద్రయాన్-3యే : ఇస్రో టీమ్
చంద్రయాన్-3 టీమ్ సభ్యుడు ఒకరు మాట్లాడుతూ, ఈ కార్యక్రమం కోసం తాము కఠోరంగా శ్రమించామని తెలిపారు. నాలుగేళ్లపాటు తమ తిండి, నిద్ర, జీవనం చంద్రయాన్-3యేనని తెలిపారు. ఇది విజయవంతమవడంతో ఇస్రోపై మరింత ఒత్తిడి పెరిగిందని చెప్పారు. ఇకపై చంద్రుడిపైకి మానవులను పంపించడం, అంగారక గ్రహంపైకి వ్యోమనౌకను పంపించడం గురించి ఇస్రో ఆలోచిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ, చంద్రయాన్-3 కార్యక్రమం ఎటువంటి లోపాలు లేకుండా జరిగిందని తెలిపారు. ఈ చరిత్రాత్మక కార్యక్రమానికి మద్దతిచ్చినవారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
సీజేఐ చంద్రచూడ్ స్పందన
చంద్రయాన్-3 విజయవంతమైన సందర్భంగా ఇస్రోను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అభినందించారు. ఈ గొప్ప దేశపు పౌరునిగా తాను ఎంతో గర్వపడుతున్నానని చెప్పారు. చంద్రునిపై చంద్రయాన్-3 దిగడాన్ని తాను వీక్షించానని తెలిపారు. ఈ విజయం చంద్రుని ఉపరితలంపై దిగిన అతి కొద్ది దేశాల సరసన భారత దేశాన్ని నిలిపిందని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Chandrayaan-3 : చంద్రునిపై భారత్ జయకేతనం ఎగురవేయాలంటూ కోట్లాది మంది పూజలు
Chandrayaan-3 : గతంలో ఇస్రోను ఎగతాళి చేసిన పాకిస్థానీ నేత, ఇప్పుడు ఏమంటున్నారంటే..