Baisakhi 2023: పంజాబ్‌లో బైసాఖీ ఉత్సవాల సందర్భంగా అమృత్‌పాల్ సింగ్ వీడియో వైరల్.. పోలీసులు అలెర్ట్
ABN , First Publish Date - 2023-04-09T17:34:07+05:30 IST
సిక్కులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించేందుకు భైసాఖి ఉత్సవాల్లో పెద్దఎత్తున సిక్కులు సమావేశం కావాలని అనుచరులకు ..
భటిండా: భైసాఖి ఉత్సవాల సందర్భంగా పంజాబ్(Punjab)లోని భటిండాలో భద్రత కట్టుదిట్టం చేశారు. భైసాఖి(Baisakhi) సమ్మేళనంలో సిక్కులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఖలిస్థాన్(Khalistani) మద్దతుదారుడు అమృత్‌పాల్ సింగ్(Amritpal Singh) పిలుపునిచ్చిన నేపథ్యంలో పంజాబ్ పోలీసులు భద్రతను పెంచారు. సిక్కులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించేందుకు భైసాఖి ఉత్సవాల్లో పెద్దఎత్తున సిక్కులు సమావేశం కావాలని అనుచరులకు పిలుపునిస్తూ అమృత్‌పాల్ ఓ వీడియో విడుదల చేశారు.
ఖలిస్థాన్ మద్దతుదారుడు, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృతపాల్ సింగ్(Waris Punjab De Chief Amritpal Singh) ఇచ్చిన పిలుపు నేపథ్యంలో పంజాబ్‌లోని బైసాఖీలో భటిండాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సిక్కుల సమస్యలపై చర్చించేందుకు పెద్ద సభ ఏర్పాటు చేయాలని సిక్కు అమృతపాల్ సింగ్ ధృవీకరించని వీడియో విడుదల చేసిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అడిషనల్ డీజీపీ సురీందర్ పాల్‌సింగ్ పర్మార్ మాట్లాడుతూ, పంజాబ్‌లో పరిస్థితి అదుపులో ఉంది. భద్రతా ఏర్పాట్లు పెంచామని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం మేం ఇక్కడ ఉన్నామని తెలిపారు. బైసాఖి సందర్భంగా ఎలాంటి నిబంధనలు లేవని స్పష్టం చేశారు. ఖలిస్థాన్ మద్దతుదారుడు అమృత్‌పాల్ సింగ్ ఒకవేళ లొంగిపోతే చట్ట ప్రకారం అతనికి సాయం చేస్తామని ఏప్రిల్ 2న డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రేమిందర్ సింగ్ తెలిపారు.
తాజాగా విడుదల చేసిన వీడియోలో అమృతపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను పారిపోలేదని.. త్వరలో ప్రజలముందుకు వస్తానని.. తాజా వీడియోలో అమృత్‌పాల్ వెల్లడించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించారు. కాగా అమృత్‌పాల్ సన్నిహితులలో ఒకరైన లవ్‌ప్రీత్ తూఫాన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 23న అమృత్‌సర్‌లోని అజ్నాలా పోలీస్ స్టేషన్‌ను అమృత్‌పాల్ మద్దతుదారులు ముట్టడించారు. అప్పటినుంచి ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మార్చి 18 నుంచి ‘ఖలిస్థాన్(Khalistani) మద్దతుదారుడు అమృత్ పాల్ సింగ్ పరారీలో ఉన్నాడు.
బైసాఖి ఉత్సవం.. సిక్కు మతంలో అత్యంత గౌరవప్రదమైన పండుగ. దీనిని 'వైశాఖి' లేదా 'బసోవా' అని కూడా అంటారు. వైశాఖ మాసం మొదటి రోజున సాధారణంగా ఏప్రిల్ 13 లేదా 14న జరుపుకుంటారు. ఈ పండుగను ప్రధానంగా ఉత్తర భారతదేశంలో జరుపుకుంటారు. ఇది వసంతకాలపు పంట సీజన్ ప్రారంభాన్ని సూచిస్తుంది. దేశవ్యాప్తంగా సిక్కు ప్రజలు ఆనందోత్సాహాలతో బైసాఖీని జరుపుకుంటారు.