Shakti Scheme For Women : కర్ణాటకలో మహిళలకు ఉచిత ప్రయాణం సరే.. సీఎం సిద్దరామయ్య ముందున్న అసలు సవాల్ ఇదే..
ABN , First Publish Date - 2023-06-11T11:42:08+05:30 IST
మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేసే శక్తి గ్యారెంటీ పథకం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఆదివారం మధ్యాహ్నం నుంచి
ఉచితం సరే.. గ్రామాలకు బస్సులేవీ..?
3వేల పల్లెలకు ఆర్టీసీ సేవలు కరువు
నేటి నుంచే మహిళలకు ఉచిత ప్రయాణం
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేసే శక్తి గ్యారెంటీ పథకం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఆదివారం మధ్యాహ్నం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు నాలుగు కార్పొరేషన్లకు చెందిన ఆర్టీసీ బస్సుల్లో టికెట్ కొనుగోలు చేయకుండానే ప్రయాణించే వెసులుబాటు రానుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మూడు వేల గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులే లేవు. ఈ గ్రామాల్లో నివసించే లక్షలాదిమంది మహిళల శక్తి పథకాన్ని సద్వినియోగం చేసుకోలేరు. రాష్ట్రంలో బెంగళూరు(Bangalore)తో కలిపి 31 జిల్లాలు ఉన్నాయి. బెంగళూరులో బీఎంటీసీ(BMTC) సర్వీసులు కొనసాగుతున్నాయి. అన్ని జిల్లా కేంద్రాల నుంచి ప్రధాన నగరాల మార్గాలకు బస్సు సర్వీసులు ఉన్నాయి. కానీ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ఉండే గ్రామాలకు ఆర్టీసీ సేవలు ఇంకా పూర్తిస్థాయిలోకి అందుబాటులోకి రాలేదు. గణాంకాల ప్రకారం మూడు వేల గ్రామాలకు ఆర్టీసీ సేవలు అందుబాటులో లేవు. ఈ గ్రామాలకు చెందిన వారు ప్రైవేట్ బస్సులు, మినీ సర్వీసులపైనే ఆధారపడుతున్నారు. రాష్ట్రంలో వేలాది ప్రైవేట్ బస్సులు ప్రజలకు సేవలందిస్తున్నాయి. గ్రామం నుంచి సమీపంలోని ప్రధాన రోడ్డుకు వచ్చి సంచరించే పరిస్థితి ప్రతి జిల్లాలోనూ ఉంది. బెంగళూరుకు దాదాపు అనుబంధంగా ఉండే మాగడి, హొస్కోటె తాలూకాల నుంచి నిత్యం రైతులు పంట దిగుబడులను కేఆర్ మార్కెట్‌లో విక్రయించుకునేందుకు ప్రైవేట్ బస్సుల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. వీరికి శక్తి పథకం ఉన్నా ప్రయోజనం లేదు. ఉడుపి, దక్షిణకన్నడ జిల్లాలో దశాబ్దాలుగా ప్రైవేట్ బస్సులే అధికంగా ఉన్నాయి.
మంగళూరు నగరంలో ప్రైవేట్ సర్వీసులకు చెందిన 328 బస్సులు రోజూ వేలాది ట్రిప్పులు కొనసాగిస్తున్నాయి. ఇక్కడ ఆర్టీసీ బస్సులు రెండు అంకెలకు మించి లేవు. కాంట్రాక్ట్ క్యారేజ్ పద్ధతిన వందలాది బస్సులు కొనసాగుతున్నాయి. తీర ప్రాంత జిల్లాల్లో 2,500కుపైగా బస్సులు సంచరిస్తున్నట్టు రాష్ట్ర ప్రైవేట్ బస్సుల యజమానుల సంఘం అధ్యక్షుడు కుయిలాడి సురేశ్‌నాయక్ తెలిపారు. చిత్రదుర్గ(Chitradurga) జిల్లాలో 450కు పైగా బస్సులు, చిక్కమగళూరులో 280 బస్సులు ఉండగా దావణగెరెలో 309, శివమొగ్గలో 646, కోలారులో 151, తుమకూరు 300కు పైగా బస్సులు ఉన్నాయి. ఉడుపి, ఉత్తరకన్నడ జిల్లాల్లో ప్రైవేట్ సర్వీసులే అధికంగా ఉన్నాయి. దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ప్రైవేట్ బస్సులకు ప్రత్యేక బస్టాండ్లు ఉన్నాయి. దశాబ్దాల కాలంగా ప్రైవేట్ బస్సుల ద్వారానే సంచారాలు సాగుతున్నాయి. ఆర్టీసీ సంస్థలు ప్రారంభమయ్యాక ప్రధాన నగరాలు, మార్గాల్లో సర్వీసులు పెంచుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతానికి అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాలకు ఆర్టీసీ సేవలు ఉన్నాయి. కానీ వాటికి ధీటుగానే గ్రామీణ ప్రాంతాలలో ప్రైవేట్ బస్సు సేవలు కొనసాగుతున్నాయి.
నేడు శక్తి గ్యారెంటీకి భారీ ఏర్పాట్లు
రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే శక్తి గ్యారెంటీ పథకం ఆదివారం నుంచి అమలులోకి రానుంది. ఉదయం ముఖ్యమంత్రి సిద్దరామ య్య మెజస్టిక్ నుంచి విధానసౌధ దాకా బీఎంటీసీ బస్సుకు కండక్టర్‌గా వ్యవహరించనున్నారు. విధానసౌధ ప్రాంగణం వద్ద భారీ వేదిక ద్వారా శక్తి పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం అందుబాటులోకి రానుంది.