Bangalore: 25 నుంచి ‘నమ్మ బెంగళూరు హబ్బ’
ABN , First Publish Date - 2023-03-21T10:38:54+05:30 IST
నమ్మ బెంగళూరు హబ్బ(Namma Bangalore Habba) ఈనెల 25 నుంచి రెండు రోజులపాటు సాగనుందని రెవెన్యూ మంత్రి అశోక్ ప్రకటించారు.
- ముగింపు వేడుకలకు కేంద్రమంత్రి అమిత్ షా
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): నమ్మ బెంగళూరు హబ్బ(Namma Bangalore Habba) ఈనెల 25 నుంచి రెండు రోజులపాటు సాగనుందని రెవెన్యూ మంత్రి అశోక్ ప్రకటించారు. సోమవారం విధానసౌధలో ఎమ్మెల్యేలు సతీశ్‌రెడ్డి, ఎం కృష్ణప్పతో కలసి మంత్రి మీడియాతో మాట్లాడారు. కర్ణాటక సంస్కృతి, చరిత్ర, వారసత్వాలను నగరంలో నివసించే ప్రజలందరికీ వివరించేలా పండుగ చేస్తామన్నారు. 25న సాయంత్రం విధానసౌధ తూర్పు భాగంలో సీఎం బసవరాజ్ బొమ్మై(CM Basavaraj Bommai) లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. అనంతరం అనన్యభట్, నవీన్ సజ్జు, జనార్దన్ బృందాల సంగీత కార్యక్రమాలు ఉంటాయన్నారు. 26న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం దాకా కబ్బన్‌పార్క్‌లోని వివిధ ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. ముగింపు వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు. విధానసౌధ ఎదుట నిర్మించిన నాడప్రభు కెంపేగౌడ, జగజ్యోతి బసవేశ్వర విగ్రహాలను అమిత్ షా ప్రారంభిస్తారన్నారు. కర్ణాటక చిత్ర కళా పరిషత్, లలిత అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో చిత్రసంతె తరహాలో కార్యక్రమాలు ఉంటాయన్నారు. బాలభవన్ ఆవరణలో రంగశంకర, నీనాసం సంస్థల వీధి నాటకాలు ఉంటాయన్నారు. యక్షగాన, బొమ్మల ప్రదర్శన, నృత్య కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. పుస్తకమేళా, బాలల చలనచిత్రోత్సవం, ఆహారమేళా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నగర ప్రజలు విరివిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.