Bangalore: బియ్యం.. కయ్యం..! రాష్ట్రంలో మొదలైన ‘రైస్’ రాజకీయం
ABN , First Publish Date - 2023-06-16T11:58:07+05:30 IST
రాష్ట్రంలో రైస్ రాజకీయం మొదలయ్యింది. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల వ్యవధిలోనే రెండో గ్యారెంటీగా బీపీఎల్, అంత్యోద
- అన్నభాగ్యను కేంద్రం అడ్డుకుంటోంది: సీఎం ఆగ్రహం
- నేనేం ఉచితం కోరలేదు... లేదంటే పోరాటమే: డీసీఎం
- గ్యారెంటీ తప్పించుకునే కుట్ర: మాజీ సీఎం బొమ్మై
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైస్ రాజకీయం మొదలయ్యింది. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల వ్యవధిలోనే రెండో గ్యారెంటీగా బీపీఎల్, అంత్యోదయ కార్డులకు పది కిలోల బియ్యం అందించే విషయంలో కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య ‘రైస్’ రాజకీయం సాగుతోంది. రాష్ట్రంలో సిద్దరామయ్య(Siddaramaiah) ప్రభుత్వం ఏర్పడిన తొలి కేబినెట్‌లోనే ఐదు గ్యారెంటీలకు ఆమోదం తెలిపారు. నాలుగు రోజులక్రితం తొలి గ్యారెంటీగా ‘శక్తి’ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు శ్రీకారం చుట్టారు. రెండో గ్యారెంటీగా జూలై ప్రారంభం నుంచి ప్రతి వ్యక్తికి 10 కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్‌కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు అన్నభాగ్యకు అవసరమైన బియ్యం విడుదలకు లేఖ రాసింది. ప్రస్తుతం బీపీఎల్ కుటుంబాలకు 5 కిలోల బియ్యం ఇస్తున్నారు. పది కేజీలకు పెంచితే 2.28 లక్షల టన్నుల బియ్యం అవసరం కానుంది. మరికొన్ని రోజుల్లోనే విడుదల కానుందని తద్వారా బియ్యం పంపిణీణి అన్నభాగ్యకు ఎటువంటి ఆటకం ఉండదని భావించారు. కానీ ఎఫ్‌సీఐ ప్రస్తుతానికి అదనపు కోటా కేటాయించలేమని తెలిపింది. చివరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్‌సీఐ(FCI) నుంచి సూచనలు ఇచ్చింది. జూన్ నెలలో బియ్యం వేలం రద్దు అయ్యిందని తద్వారా రాష్ట్రాలకు బియ్యం, గోధుమలు లభించే అవకాశం లేదని సూచించింది.
- వేలంలో 10 నుంచి 100 మెట్రిక్ టన్నుల బియ్యం లేదా గోధుమలు కొనుగోలు చేయవచ్చు. గతంలో గరిష్ఠం 3వేల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు అవకాశం ఉండేది. కానీ చిన్న, మధ్య తరహా కొనుగోలుదారులు ఎక్కువమంది పాల్గొనేలా నిబంధనలు సడలించారు. ఈ కారణంగా వేలం కొనసాగదని 2023-24 ఆర్థిక సంవత్సరంలో తొలివేలం ఈనెల 28న జరగనుందని స్పష్టం చేసింది. కాగా రాష్ట్రంలో అమలు చేయదలిచిన అన్నభాగ్యకు బియ్యం విడుదల చేసే విషయంలో కేంద్రప్రభుత్వం రాజకీయాలకు పాల్పడుతోంది, ఎఫ్‌సీఐ ద్వారా నాటకమాడిందని సీఎం సిద్దరామయ్య మండిపడ్డారు. కన్నడిగులు, పేదలకు అందించే బియ్యం విషయంలో రాజకీయం సరికాదని విరుచుకుపడ్డారు. ఒకానొక దశలో ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై ప్రారంభం నుంచి అన్నభాగ్యకు వాయిదా వేయమని, అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. తెలంగాణ, చత్తీస్‌ఘడ్‌లతోపాటు వివిధ రాష్ట్రాలలో కొనుగోళ్లకు సిద్ధమయ్యారు.
ఉచితంగా బియ్యం కోరడం లేదు: డీసీఎం
అన్నభాగ్య పథకం కోసం కేంద్రం నుంచి బియ్యం ఉచితంగా కోరలేదని డీసీఎం డీకే శివకమార్(DCM DK Shivakamar) మండిపడ్డారు. అన్నభాగ్య పథకానికి ఎక్కువ కోటా కేటాయించేలా కేంద్రానికి విన్నవించా మన్నారు. మైసూరులో మీడియాతో మాట్లాడుతూ పేదలకు అందించే బియ్యం విషయంలో కేంద్రం నిర్ణయం సరికాదన్నారు. ఇదే విషయమై పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ప్రధానితో భేటీకి సీఎం యత్నం..?
రాష్ట్రంలో ‘అన్నభాగ్య’ అమలుకోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీని భేటీ అయ్యేందుకు సీఎం సిద్దరామయ్య సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈనెల 21న సీఎం ఢిల్లీలో కాంగ్రెస్ నేతలను కలిసేందుకు సిద్ధమయ్యారు. తాజా రాజకీయాలపై ఆయన అగ్రనేతలతో సమావేశం కాదలిచారు. ఇదే సందర్భంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)ని కలిసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కావస్తోంది. ఇప్పటివరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసే విషయమై ఎక్కడా చర్చకు రాలేదు. కానీ ‘అన్నభాగ్య’ విషయంలో భేటీ కావాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
బియ్యం కోరాల్సింది ఎఫ్‌సీఐను కాదు: మాజీ సీఎం బొమ్మై
అన్నభాగ్యకు అదనపు కోటా బియ్యం అవసరమైన మేరకు కేంద్రప్రభుతాన్ని, సంబంధిత పౌర, ఆహార సరఫరాల మంత్రిని కోరాలని అయితే ఎఫ్‌సీఐను కోరడం ఎంతవరకు సమంజసమని మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై ప్రశ్నించారు. గరురువారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం నుంచి బియ్యం కావాల్సి వస్తే ముందుగా పౌర, ఆహార సరఫరాల శాఖ మంత్రిని భేటీ కావాలన్నారు. అయితే ఎఫ్‌సీఐకు లేఖ రాయడం సరికాదన్నారు. ఎఫ్‌సీఐది కేవలం నిర్వహణ మాత్రమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్యారెంటీ సక్రమంగా అమలు కావాలంటే కేంద్రం ఇచ్చే ఐదు కేజీలకు గ్యారెంటీ 10కేజీలో కలిపి మొత్తం 15 కేజీలు ఇవ్వాలన్నారు. ఎఫ్‌సీఐ గోడౌన్‌ల ద్వారా టెండరు ద్వారా అవసరమైన బియ్యం కొనుగోలు లేదా షార్ట్ టెండరు ద్వారా పొందే అవకాశం ఉందన్నారు. అలా కాకుండా ఒక్కసారిగా ఎఫ్‌సీఐను కోరి ప్రజలకు ఇచ్చిన హామీని తప్పించుకునేందుకు కాంగ్రెస్ కుంటిసాకులు చెబుతోందన్నారు.