Bangalore: కొత్త ప్రభుత్వానికి కొండంత బలం.. రెండు నెలల్లోనే రూ. 25 వేల కోట్ల ఆదాయం

ABN , First Publish Date - 2023-06-22T12:54:03+05:30 IST

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఐదు గ్యారెంటీలతో పెనుభారం మోసే పరిస్థితి ఏర్పడింది. ఎలా నిధులు సమకూర్చుకోవాలో

Bangalore: కొత్త ప్రభుత్వానికి కొండంత బలం.. రెండు నెలల్లోనే రూ. 25 వేల కోట్ల ఆదాయం

- ఆశాజనకంగా పన్నుల వసూలు

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఐదు గ్యారెంటీలతో పెనుభారం మోసే పరిస్థితి ఏర్పడింది. ఎలా నిధులు సమకూర్చుకోవాలో అనే ఆలోచనలో పడిన కొత్త ప్రభుత్వానికి పన్నుల వసూళ్లు కొంత ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన రెండు నెలల్లోనే రూ.25వేల కోట్లు పన్నుల రూపంలో రావడం ప్రభుత్వానికి ఊరటనిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి సొంత పన్నుల మూలమైన వాణిజ్య, ఎక్సైజ్‌, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌, వాహనాల పన్నుల ద్వారా ఉత్తమంగా ఆదాయం సమకూరుతోంది. జూలై 7న కొత్త బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. కొత్తగా పన్నులకు లక్ష్యం పెట్టుకోనున్నారు. కొత్త యాక్షన్‌ప్లాన్‌ అప్పటి నుంచి అమలులోకి రానుంది. కొవిడ్‌ తర్వాత రాష్ట్రంలో క్రమేపీ ఆర్థిక వ్యవహారాలు మెరుగవుతున్నాయి. అందుకు తగినట్టుగానే పన్నుల వసూళ్ల లక్ష్యం పూర్తి చేసేందుకు ఆర్థికశాఖ క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తోంది. శాసనసభ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పుడే 2023-24 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. వాణిజ్య పన్నుల ద్వారా రూ.9,311 కోట్లు వసూలయింది. 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి భాగం మార్చిలో సరుకు, సేవా వ్యవహారాలు మెరుగయ్యాయి. దీనికితోడు వ్యాపార వ్యవహారాలు, పారిశ్రామికవేత్తలతోపాటు ఉత్తమ లావాదేవీలు కొనసాగిన మేరకు పన్నుల చెల్లింపుల ద్వారా ఆదాయం గణనీయంగా పెరిగింది. అబ్కారీ శాఖ ద్వారా రెండు నెలల్లో రూ.4,484 కోట్లు ఆదాయం సమకూరింది. మే నెలలో రూ.2,526 కోట్లు వసూలైంది. గత సంవత్సరంతో పోలిస్తే రూ.187 కోట్లు అధికంగా వసూలైంది. శాసనసభ ఎన్నికలు, ఫలితాలు ప్రకటించిన వ్యవధిలోనే ఆదాయం పెరగడం విశేషం. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ ద్వారా రూ.2,624 కోట్లు సాధ్యమైంది. ఆస్తుల రిజిస్ట్రేషన్‌, డాక్యుమెంట్లు సరళీకృతం చేసేందుకు కావేరి 2.0 టెక్నాలజీని ఏప్రిల్‌ 1నుంచి ప్రవేశపెట్టారు. కొత్త సాంకేతికత ద్వారా ఆస్తుల రిజిస్ట్రేషన్‌ మరింత సులభతరమైంది. మోటారు వాహనాల పన్నుల ద్వారా ఏప్రిల్‌, మే నెలల్లో రూ.1,562 కోట్లు సాధ్యమైంది. ఏడాది టార్గెట్‌లో ఆశాజనకంగా పన్నుల వసూలైనట్టయింది.

pandu3,2.jpg

తాజా మాజీ సీఎం బసవరాజ్‌ బొమ్మై 2023-24 సంవత్సరం బడ్జెట్‌లో నాలుగు విభాగాల ద్వారా రూ.1,56,500 కోట్ల పన్నుల వసూళ్లు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. జూలై 7న సీఎం సిద్దరామయ్య ఆర్థికమంత్రి హోదాలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో కొత్త లక్ష్యాలు విధించే అవకాశం ఉంది. పైగా అబ్కారీ శాఖకు తొలి రెండు నెలలు ఎక్కువ పన్నులు రావడానికి ఎన్నికల సీజన్‌ ప్రధాన కారణమైంది. ఒకవేళ లోక్‌సభ ఎన్నికలు వచ్చినా 2024 ఆర్థిక సంవత్సరం తర్వాతనే రానున్నాయి. అయినా లోక్‌సభ ఎన్నికలు, శాసనసభ ఎన్నిల తరహాలో పరిణామం ఉండదు. పైగా శక్తి గ్యారెంటీ ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో భారీగానే లోటు ఏర్పడనుంది.

pandu3.3.jpg

Updated Date - 2023-06-22T12:54:03+05:30 IST