బిహార్‌లో బీసీలు 63 శాతం
ABN , First Publish Date - 2023-10-03T01:55:38+05:30 IST
దేశంలో రాజకీయ ప్రకంపనలకు కారణం కానున్న బిహార్‌లోని కులగణన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ లెక్కల ఆధారంగా రాజకీయ కార్యాచరణకు బిహార్ సీఎం నితీశ్‌కుమార్ సిద్ధమవుతున్నారు..
మొత్తం జనాభా 13.07 కోట్లు
వారిలో ఓబీసీ 27, ఈబీసీలు 36%
ఎస్సీలు 19.65%.. ఎస్టీలు 1.68%
హిందువులు 81.99 శాతం..
ముస్లింల జనాభా 17.7 శాతం
బిహార్ కులగణన సర్వేలో వెల్లడి
కోటాపై మిత్రపక్షాలతో భేటీ: నితీశ్
కులం పేరుతో దేశం విభజన: మోదీ
మేమొస్తే దేశమంతా గణన: రాహుల్
పట్నా, అక్టోబరు 2: దేశంలో రాజకీయ ప్రకంపనలకు కారణం కానున్న బిహార్‌లోని కులగణన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ లెక్కల ఆధారంగా రాజకీయ కార్యాచరణకు బిహార్ సీఎం నితీశ్‌కుమార్ సిద్ధమవుతున్నారు. దేశవ్యాప్తంగా కులగణనకూ డిమాండ్లు పెరుగుతుండగా.. తమ ప్రాథమ్యం అదేనని కాంగ్రెస్ ప్రకటించింది. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతుందని భావిస్తున్న బిహార్ కులగణన సర్వేలో బీసీలే సింహభాగం అని తేలింది. బిహార్ జనాభాలో బీసీలు మూడింట రెండొంతులు ఉన్నట్లు స్పష్టమైంది. ఆ రాష్ట్రంలో మొ త్తం జనాభా లెక్క 13.07 కోట్లుగా తేలగా.. వారిలో 63% మేర బీసీలున్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని బిహార్ రాష్ట్ర అభివృద్ధి కమిషనర్ వివేక్‌సింగ్ సోమవారం కులగణన సర్వే నివేదికను విడుదల చేశా రు. ఆ నివేదిక ప్రకారం.. 63% బీసీల్లో ఇతర వెనుకబడిన తరగతుల(ఓబీసీ) వాటా 27.13%, అత్యంత వెనుకబడిన తరగతుల(ఈబీసీ) వాటా 36శాతంగా తేలింది. కులాలవారీగా చూస్తే.. ఓబీసీ వర్గానికి చెందిన యాదవుల జనాభా బిహార్‌లో అధికంగా ఉందని ఈ నివేదిక స్పష్టంచేసింది. రాష్ట్ర జనాభాలో వీరి వాటా 14.27% కావడం గమనార్హం..! ఇక షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు 19.65%, షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు 1.68 (సుమారు 22 లక్షలు)శాతంగా ఉన్నారు. జనరల్ కేటగిరీ వారి జనాభా 15.52% ఉన్నట్లు తేలింది. బిహార్ జనాభాలో 81.99% మంది హిందువులున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. ముస్లింల వాటా 17.7% కాగా.. మిగతావారిలో క్రైస్తవులు, సిక్కులు, జైనులు, ఏ మతాన్ని పాటించని వారున్నారు. వీరి వాటా అరశాతం లోపే(0.31%) కావడం గమనార్హం..!
కోర్టు కేసుల నడుమ..
నిజానికి బ్రిటిష్ హయాంలో కులగణనతోకూడిన జనాభాలెక్కలను తీసేవారు. 1931లో చివరిగా సమగ్ర కులగణనను నిర్వహించారు. స్వతంత్ర భారతదేశంలో బిహార్ రాష్ట్రంలో చేపట్టిన కులగణనే మొదటిది. తెలంగాణలో 2014లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో కూడా ఓ కాలమ్‌లో కులాన్ని ప్రస్తావించినా, ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, మైనారిటీ కేటగిరీల జనగణనను వెల్లడించిందే తప్ప.. కులాలవారీగా వివరాలను బహిర్గతం చేయలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా కులగణన సాధ్యం కాదని స్పష్టం చేయగా.. ఆ ప్రక్రియను తమ రాష్ట్రంలో చేపడతామంటూ బిహార్ సీఎం నితీశ్‌కుమార్ గతేడా ది జూన్‌లో ప్రకటించారు. ఈ ఏడాది జనవరిలో కులాల వారీగా జనగణన ప్రారంభమవ్వగా.. రాష్ట్రంలోని 38 జిల్లాల్లో రెండు దశల్లో ఈ ప్రక్రియను పూర్తిచేశారు. కులగణను వ్యతిరేకిస్తూ పట్నా హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలవ్వగా.. వాటిని కొట్టివేసింది. సర్వేకు అనుమతినిచ్చింది. దీంతో.. పిటిషనర్లు సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లారు. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఇక బిహార్ కులగణనలో బీసీల వాటా 63 శాతంగా తేలడంతో.. ఆ కేటగిరీ కోటాను పెంచే దిశలో సీఎం నితీశ్ సమాలోచనలు జరుపుతున్నట్లు ప్రకటించారు. అధికార కూటమిలోని భాగస్వామ్య పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. జనాభా ఆధారంగా కోటాకు చర్యలు తీసుకుంటామన్నారు. తాజా నివేదికపై బీజేపీ స్పందించింది. తమ పార్టీ కులగణనకు ఆమోదం తెలిపిందని బీజేపీ బిహార్ అధ్యక్షుడు సామ్రాట్‌చౌదరి గుర్తుచేశారు.
మోదీ అలా.. రాహుల్ ఇలా..
మధ్యప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాలు దేశాన్ని కులం పేరుతో విభజిస్తున్నాయని మండిపడ్డారు. బిహార్ కులగణన సర్వేను ప్రస్తావించకుండా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అయితే కేంద్రం లో అధికారంలోకి వస్తే.. దేశంలో కులగణన చేపడతామని.. ఓబీసీలకు న్యాయం చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రకటించారు. ‘‘బిహార్‌లో 84ు మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలే.. ప్రభుత్వ ప్రయోజనాల్లో, ఉద్యోగాల్లో వారి వాటా ఆ మేరకు ఉండాలి. కేంద్ర ప్రభుత్వంలో 90 మంది కార్యదర్శుల్లో ముగ్గురే ఓబీసీలు. బడ్జెట్‌లో 5ు మేరకే వారు నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే.. దేశంలో కులగణన అవసరం’’ అని అన్నారు.
ఎక్కువ జనాభా ఉన్న టాప్-10 కులాలు
కులం శాతం సంఖ్య
యాదవులు 14.27% 1.86 కోట్లు
దుషాద్ 5.31% 69.43 లక్షలు
చమర్ 5.25% 68.69 లక్షలు
కోయిరీలు 4.2% 55.06 లక్షలు
ముషార్ 3.08% 40.35 లక్షలు
బ్రాహ్మణులు 3.65%47.81 లక్షలు
రాజ్‌పుత్ 3.45% 45.10 లక్షలు
కుర్మీలు 2.87% 37.62 లక్షలు
బనియా 2.30% 30.26 లక్షలు
కాయస్థులు 0.60%7.86 లక్షలు