రాజస్థాన్‌లో వందే భారత్‌ ఎక్స్‌ప్రె్‌సకు తప్పిన పెను ప్రమాదం

ABN , First Publish Date - 2023-10-03T02:16:54+05:30 IST

వందే భారత్‌ ఎక్స్‌ప్రె్‌సకు రాజస్థాన్‌లో పెను ప్రమాదం తప్పింది. ఉదయ్‌పూర్‌-జైపూర్‌ వందే భారత్‌ రైలు..

రాజస్థాన్‌లో వందే భారత్‌ ఎక్స్‌ప్రె్‌సకు తప్పిన పెను ప్రమాదం

పట్టాలపై రాళ్లు.. ఫిష్‌ ప్లేట్స్‌ మధ్య ఇనుప రాడ్‌

జైపూర్‌, అక్టోబరు 2: వందే భారత్‌ ఎక్స్‌ప్రె్‌సకు రాజస్థాన్‌లో పెను ప్రమాదం తప్పింది. ఉదయ్‌పూర్‌-జైపూర్‌ వందే భారత్‌ రైలు.. జైపూర్‌ వెళ్తుండగా పట్టాలపై రాళ్లు ఉండటాన్ని రైలు డ్రైవర్‌ గుర్తించి అప్రమత్తమయ్యారు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును నిలిపివేశారు. ఒకవేళ వీటిని గుర్తించకుండా రైలు ముందుకు దూసుకువెళ్లినట్లయితే పట్టాలు తప్పి పెను ప్రమాదం సంభవించి ఉండేదని భావిస్తున్నారు. చిత్తోర్‌గఢ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఒక ర్యాలీలో ప్రసంగించే రోజునే ఈ ఘటన చోటు చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పక్కా ప్రణాళికా ప్రకారమే ఈ కుట్ర జరిగి ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటనా స్థలంలో తీసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పట్టాలపై ఉన్న రాళ్లలో కొన్ని ఇటుకల పరిమాణంలో ఉన్నాయి. వీటిని రైల్వే సిబ్బంది తొలగించారు. ఫిష్‌ ప్లేట్స్‌ లేదా జాయింట్ల మధ్య ఒక ఇనుప రాడ్‌ కూడా ఉన్నట్టు వీడియోలో కనిపించింది. చిత్తోర్‌గఢ్‌ సమీపంలో ఉదయం 9.55 గంటల ప్రాంతంలో ఈ రాళ్లను లోకోపైలెట్‌ గుర్తించారు. ఈ ఘటన నేపథ్యంలో గ్యాంగ్‌రార్‌, సోనియానా స్టేషన్ల మధ్య ట్రాక్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను చూసిన సోషల్‌ మీడియా యూజర్లు ఇందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఉదయ్‌పూర్‌-జైపూర్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రె్‌సను ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సెప్టెంబరు 24న ప్రారంభించారు.

Updated Date - 2023-10-03T02:16:54+05:30 IST