2024 Loksabha Election: పాట్నా వేదికగా విపక్షాల భారీ సమావేశం.. హాజరుకానున్న 18 పార్టీలు
ABN , First Publish Date - 2023-05-28T20:28:46+05:30 IST
ప్రతిపక్షాల ఐక్య కూటమి ఏర్పాటుకు కసరత్తు ముమ్మరమవుతోంది. పాట్నా వేదకగా జనవరి 12న విపక్షాల భారీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో 2024 ఎన్నికల్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహరచన జరుగనుంది. 18కి పైగా భావసారూప్యత కలిగిన పార్టీలు ఈ సమావేశంలో పాల్గొంటాయని తెలుస్తోంది.
న్యూఢిల్లీ: ''ప్రతిపక్షాల ఐక్య కూటమి'' ఏర్పాటుకు కసరత్తు ముమ్మరమవుతోంది. పాట్నా (Patna) వేదకగా జనవరి 12న విపక్షాల భారీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో 2024 ఎన్నికల్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహరచన జరుగనుంది. 18కి పైగా భావసారూప్యత కలిగిన పార్టీలు ఈ సమావేశంలో పాల్గొంటాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఇది సన్నాహక సమావేశమని, విపక్ష పార్టీల ప్రధాన సమావేశం ఆ తరువాత జరుగుతుందని విపక్ష పార్టీకి చెందిన ఒక సీనియర్ నేత తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని సమర్ధవంతంగా ఎదుర్కొనే విపక్ష పార్టీలతో 'ఐక్య కూటమి' ఏర్పాటు కోసం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కొద్ది నెలలుగా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. విపక్ష పార్టీలు, నేతలను కలుసుకుంటున్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహల్ గాంధీ, మమతాబెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ సహా పలువురు విపక్ష పార్టీల ప్రముఖులను ఇప్పటికే ఆయన కలుసుకున్నారు. నితీష్ కుమార్ ప్రతిపాదించిన ''వన్-ఆన్-వన్'' వ్యూహానికి మమతా బెనర్జీ సైతం సుముఖత వ్యక్తం చేశారు. ఈ ఫార్ములా ప్రకారం ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఆ పార్టీలు బీజేపీతో నేరుగా తలబడతాయి. బీజేపీ-కాంగ్రెస్ ముఖాముఖీ తలపడే 200కు పైగా సీట్లలో కాంగ్రెస్‌ను ప్రాంతీయ పార్టీలు బలపరుస్తాయి.