Ramcharitmanas : హత్య కేసులో జీవిత ఖైదీ ‘రామ్‌చరిత్‌మానస్‌’ను ఏం చేశాడంటే...

ABN , First Publish Date - 2023-01-25T18:54:42+05:30 IST

బిహార్‌లోని ముంగేర్ జిల్లావాసి హరిహర్ ప్రసాద్ 1991లో జరిగిన హత్య కేసులో దోషి అని నిర్థరణ కావడంతో కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది.

Ramcharitmanas : హత్య కేసులో జీవిత ఖైదీ ‘రామ్‌చరిత్‌మానస్‌’ను ఏం చేశాడంటే...
Ramcharitmanas

పాట్నా : హత్య కేసులో జీవిత ఖైదును అనుభవిస్తున్న హరిహర్ ప్రసాద్ ఆధ్యాత్మిక రంగంలో ఘనత సాధించారు. రామ కథను కడురమ్యంగా వివరించిన రామ్‌చరిత్‌మానస్‌ను ఆంగిక (Angika) అనే భాషలోకి అనువదించారు. ఈ అనువాదాన్ని జైలర్ మనోజ్ కుమార్ ప్రూఫ్ రీడింగ్ చేస్తున్నారు. బిహార్‌లోని భాగల్పూర్, ముంగేర్, బంకా జిల్లాల్లో ఆంగిక భాషను మాట్లాడతారు.

బిహార్‌లోని ముంగేర్ జిల్లావాసి హరిహర్ ప్రసాద్ 1991లో జరిగిన హత్య కేసులో దోషి అని నిర్థరణ కావడంతో కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. 2016 నుంచి ఆయన భాగల్పూరు స్పెషల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన హోం గార్డ్‌గా పని చేసేవారు. ఆయనకు భాష మీద గొప్ప పట్టు ఉందని అంతకుముందు జైలర్‌గా పని చేసిన రాకేశ్ కుమార్ సింగ్ గుర్తించారు. రామ్‌చరిత్‌మానస్‌ను అనువదించాలని ప్రోత్సహించారు. సింగ్ బదిలీ అయిన తర్వాత ప్రస్తుత జైలర్ మనోజ్ కుమార్ వచ్చారు. ఆయన కూడా హరిహర్‌ను ప్రోత్సహించారు.

ఈ అనువాదాన్ని జైలులో ఉన్న ముద్రణాలయంలోనే ముద్రించాలని హరిహర్ కోరారు. హరిహర్ తన ప్రవర్తనతో జైలులో అందరికీ ఆత్మీయుడిగా మారారు. ఆయన పసుపు రంగు వస్త్రాన్ని ధరించి, రామ్‌చరిత్‌మానస్‌ను పఠిస్తూ ఉంటే, ఇతర ఖైదీలు ఆయన చుట్టూ కూర్చుని, వింటూ ఉంటారు. దీంత జైలు వాతావరణం పూర్తిగా మారిపోయిందని జైలర్ మనోజ్ చెప్పారు.

Updated Date - 2023-01-25T18:54:46+05:30 IST