Bharat : ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ఇండియా పేరును భారత్‌గా మార్చే బిల్లు రాబోతోందా?

ABN , First Publish Date - 2023-09-05T13:57:38+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో సంచలనం సృష్టించబోతున్నట్లు కనిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ, డిజిటల్ ఇండియా, చంద్రయాన్-3 వంటివాటి సరసన దేశం పేరు మార్పు కూడా జత కలవబోతున్నట్లు తెలుస్తోంది.

Bharat : ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ఇండియా పేరును భారత్‌గా మార్చే బిల్లు రాబోతోందా?

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో సంచలనం సృష్టించబోతున్నట్లు కనిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ, డిజిటల్ ఇండియా, చంద్రయాన్-3 వంటివాటి సరసన దేశం పేరు మార్పు కూడా జత కలవబోతున్నట్లు తెలుస్తోంది. మన దేశం పేరును ‘ఇండియా’కు బదులుగా ‘భారత్’ అని మార్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఇప్పటికే ఆరెస్సెస్ చీఫ్ మన దేశాన్ని భారత్ అని పిలవాలని అంటున్నారు. తాజాగా రాష్ట్రపతి భవన్ కూడా జీ20 దేశాధినేతలకు పంపిన ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని పేర్కొంది. ఈ పరిణామాలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

రాష్ట్రపతి భవన్ ఆహ్వాన పత్రికల్లో..

ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లు, దేశం పేరును మార్చే బిల్లు వస్తాయని ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ఈ నెల 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో జీ20 దేశాధినేతల సమావేశాలు జరుగుతాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 9న రాత్రి ఈ దేశాధినేతల గౌరవార్థం విందు ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంగా వారికి రాష్ట్రపతి భవన్ పంపిన ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని పేర్కొంది.

ఆ పుస్తకంలో కూడా..

అదే విధంగా విదేశీ ప్రతినిధులకు మన దేశ అధికారులకు ఓ పుస్తకాన్ని అందజేశారు. ఈ పుస్తకం శీర్షిక ‘‘భారత్, ది మదర్ ఆఫ్ డెమొక్రసీ’’ (భారత్, ప్రజాస్వామ్యం యొక్క తల్లి). మన దేశం వేలాది సంవత్సరాల నుంచి ప్రజాస్వామిక విలువలతో మనుగడ సాగిస్తోందని తెలిపేందుకు ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పుస్తకం ప్రారంభంలో, ‘‘భారత్‌లో, అంటే ఇండియాలో, రికార్డయిన ప్రాచీన చరిత్ర నుంచి పాలనలో ప్రజల సమ్మతిని తీసుకోవడం జీవనంలో ఓ భాగం’’ అని రాశారు.


ఈ మార్పును స్వాగతించినవారిలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఒకరు. ఆయన ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘గణతంత్ర భారత్ - అమృత కాలం దిశగా మన నాగరికత సగర్వంగా దూసుకెళ్తున్నందుకు సంతోషంగా, గర్వంగా ఉంది’’ అని తెలిపారు. ఈ మార్పును బీజేపీ నేతలు స్వాగతిస్తుండగా, ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి అభ్యంతరం వ్యక్తమైంది.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరామ్ రమేశ్ మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘అయితే ఈ వార్త నిజమే. సెప్టెంబరు 9న జరిగే జీ20 విందు కోసం ఆహ్వాన పత్రాలను రాష్ట్రపతి భవన్ పంపించింది. దీనిలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అని పేర్కొనడానికి బదులుగా, ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని రాశారు. ఇప్పుడు రాజ్యాంగంలోని అధికరణ 1 ఈ విధంగా ఉంటుంది : ‘భారత్, అంటే ఒకప్పటి ఇండియా, రాష్ట్రాల యూనియన్.’ కానీ ఇప్పుడు ఈ ‘రాష్ట్రాల యూనియన్’ దాడికి గురవుతోంది’’ అని ఆందోళన వ్యక్తం చేశారు.

జేపీ నడ్డా వ్యాఖ్యలు

బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందిస్తూ, దేశ గౌరవానికి, గర్వకారణంగా నిలిచేవాటికి సంబంధించిన ప్రతి అంశంపైనా కాంగ్రెస్‌ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తోందని ప్రశ్నించారు. ‘భారత్ జోడో’ అంటూ రాజకీయ యాత్రలు చేయడమెందుకు? ‘భారత్ మాతా కీ జై’ నినాదాన్ని ద్వేషించడం ఎందుకు? అని నిలదీశారు. దేశం పట్ల, రాజ్యాంగం, రాజ్యాంగ వ్యవస్థల పట్ల కాంగ్రెస్ పార్టీకి గౌరవం లేదని స్పష్టమవుతోందన్నారు. ఆయన (జైరామ్ రమేశ్‌) ఓ కుటుంబం ముఖస్తుతి కోసమే మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ జాతి వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక ఉద్దేశాల గురించి యావత్తు దేశానికి తెలుసునని చెప్పారు.


ఆరెస్సెస్ చీఫ్ వ్యాఖ్యలు

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) ఇటీవల మాట్లాడుతూ, ‘ఇండియా’ అనే పదాన్ని వాడటం మానేయాలని, ‘భారత్’ అని పిలవాలని కోరారు. భారత్ పేరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారత్‌యే అవుతుందన్నారు. రాసేటపుడు, మాట్లాడేటపుడు భారత్ అనే పిలవాలన్నారు.

రచ్చ మొదలైనది ఎప్పుడంటే..

ఇండియా వర్సెస్ భారత్ అనే చర్చ ప్రతిపక్ష కూటమికి ఇండియా అని పేరు పెట్టినప్పటి నుంచి తీవ్ర స్థాయికి చేరింది. కాంగ్రెస్, టీఎంసీ, ఎన్‌సీపీ (శరద్ పవార్ వర్గం), శివసేన-యూబీటీ, ఆప్ సహా మొత్తం 28 పార్టీల కూటమిని Indian National Developmental Inclusive Alliance (I.N.D.I.A) అని పిలుస్తున్నారు. ఇటీవల జరిగిన ఈ కూటమి నేతల సమావేశంలో ‘జుడేగా భారత్-జీతేగా ఇండియా’ అనే నినాదాన్ని ప్రారంభించారు.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా మధ్య పోరాటం జరుగుతుందన్నారు. ప్రధాని మోదీ, ఇండియా మధ్య; బీజేపీ భావజాలం, ఇండియా మధ్య పోరాటం జరుగుతుందన్నారు. ఇండియాకు వ్యతిరేకంగా ఎవరైనా నిలబడితే ఏం జరుగుతుందో తెలుసా? ఎవరు గెలుస్తారో తెలుసా? అన్నారు.

ప్రతిపక్షాలపై మోదీ వ్యాఖ్యలు

ప్రధాని మోదీ మాట్లాడుతూ, ప్రతిపక్షాలు తమ కూటమికి పేరును మార్చుకోవడం ద్వారా తమ పాపాలను కడిగేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయన్నారు. పేదలకు వ్యతిరేకంగా ఎలా వ్యవహరించినదీ కనిపించకుండా దాచిపెట్టుకోవడం కోసం యూపీయే నుంచి ఇండియా అనే పేరు పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ఇండియా అనే పేరును దేశభక్తితో పెట్టుకోలేదని, దేశాన్ని దోచుకోవాలనే ఉద్దేశంతోనే ఆ పేరు పెట్టుకున్నారని మండిపడ్డారు.

సుదీర్ఘ కాలం నుంచి వస్తున్న డిమాండ్

దేశం పేరును భారత్‌గా మార్చాలనేది భారతీయ జనతా పార్టీ చిరకాల వాంఛ. బీజేపీ ఎంపీ, గుజరాత్ నేత మితేష్ పటేల్ 2022 డిసెంబరులో లోక్ సభలో ఓ ప్రశ్న అడిగారు. 1949నాటి రాజ్యాంగ సభ ఆలోచనల ప్రకారం ఇండియా పేరును ‘‘భారత్’’ లేదా ‘‘భరతవర్ష’’గా మార్చుతారా? లేదా? అని ప్రశ్నించారు. ఇండియా అనే పేరును బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ పెట్టిందని, ఇది మన దేశం బానిసత్వంలో ఉన్న విషయాన్ని గుర్తు చేస్తుందని తెలిపారు.

మరోవైపు దేశ ప్రజలను బానిస మనస్తత్వం నుంచి విముక్తి చేస్తామని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. అమృత కాలంలో అటువంటి మనస్తత్వాని్కి సంబంధించిన ప్రతి విషయాన్నీ తొలగిస్తామని చెప్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం రాజ్యాంగం నుంచి ‘ఇండియా’ను తొలగించి ‘భారత్’ అని చేర్చేందుకు కూడా కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి :

Teachers’ Day : ఉపాధ్యాయులకు వందనం : మోదీ

Parliament : ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు?.. ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్ సంకేతాలు..

Updated Date - 2023-09-05T14:06:54+05:30 IST