Biryani: బిర్యానీ ప్రియులకు అలర్ట్.. అక్కడ తిన్నారో..?!
ABN , First Publish Date - 2023-02-23T10:26:09+05:30 IST
రుచికరమైన బిర్యానీ(Biryani) తక్కువ ధరకు వచ్చిందని ఆవురావురుమని తినేస్తున్నారా?.. అయితే కొంతకాలానికి మీ గొంతులో నుంచి ‘పిల్లి’కూతలు
- మీ గొంతులో మియావ్!.. మియావ్!!
చెన్నై, (ఆంధ్రజ్యోతి): రుచికరమైన బిర్యానీ(Biryani) తక్కువ ధరకు వచ్చిందని ఆవురావురుమని తినేస్తున్నారా?.. అయితే కొంతకాలానికి మీ గొంతులో నుంచి ‘పిల్లి’కూతలు వస్తే మాత్రం అందుకు మీరే బాధ్యులు!.. ఎందుకంటే ఇప్పుడు కొన్ని చోట్ల ఫుట్‌పాత్‌లపై విక్రయించే బిర్యానీలో పిల్లి మాంసాన్ని వినియోగిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో పోలీసులు, ఆరోగ్య, ఆహార శాఖాధికారులు ఆయా దుకాణాల కోసం జల్లెడ పడుతున్నారు. చెన్నై(Chennai) మహానగరంలో ఫుట్‌పాత్‌లపై మూడు పూటలా బిర్యానీ వ్యాపారం జోరుగా సాగుతోంది. మరీ ముఖ్యంగా మధ్యాహ్నం సమయాల్లో వేడివేడి బిర్యానీ విక్రయాలు అధిక సంఖ్యలో జరుగుతున్నాయి. అయితే, కొన్ని దుకాణాల్లో పిల్లి మాంసంతో బిర్యానీ తయారు చేసి విక్రయిస్తున్నట్టు జంతు సంరక్షణ అధికారులు, పోలీసులు గుర్తించారు. పైగా బిర్యానీ కోసం సిద్ధంగా ఉంచిన 11 పిల్లులను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం కాకుల మాంసాన్ని చికెన్(Chicken)లో కలిసి బిర్యానీ చేసి విక్రయించిన వైనం వెలుగుచూసిన విషయం తెలిసిందే. తాజాగా పిల్లి మాంసంతో బిర్యానీ చేసి మటన్ బిర్యానీగా విక్రయిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. వీటికి మరింత ఊతమిచ్చేలా పలు ప్రాంతాల్లో పిల్లులు మాయమవుతున్నట్టు అధికారులు గుర్తించారు.
నగరంలో ఉండే సంచార జాతులకు చెందినవారు పిల్లుల్ని వేటాడి వాటిని ఫుట్‌పాత్(Footpath) దుకాణాల వ్యాపారులకు విక్రయిస్తున్నట్టు తేలడంతో జంతు సంరక్షణ విభాగం అధికారులు, పోలీసులతో కలిసి ప్రత్యేక నిఘా వేశారు. ఇటీవల మద్రాస్ హైకోర్టు వెనుకభాగంలో ఉన్న సంచారజాతుల వారి నుంచి 11 పిల్లుల్ని స్వాధీనం చేసుకున్నారు. వీటిని మాంసం కోసం విక్రయించేందుకు సిద్ధం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీనిపై జంతు సంరక్షణ విభాగం అధికారులు మాట్లాడుతూ.. నగరంలో పలు చోట్ల ఫుట్‌పాత్ దుకాణాల్లో పిల్లి మాంసం, మటన్ కలిపి బిర్యానీగా తయారు చేసి విక్రయిస్తున్నట్లు తమ విచారణలో వెల్లడైందని తెలిపారు.