Sushil Modi: నితీష్‌ వస్తానన్నా...మేము తలుపులు మూసేశాం..!

ABN , First Publish Date - 2023-07-30T18:20:49+05:30 IST

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఏ క్షణంలోనైనా తిరిగి ఎన్‌డీఏలోకి వస్తారంటూ కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాజ్యసభ ఎంపీ సుశీల్ మోదీ తోసిపుచ్చారు. ఆయన రావాలనుకున్నా బీజేపీ అందుకు సిద్ధంగా లేదని చెప్పారు.

Sushil Modi: నితీష్‌ వస్తానన్నా...మేము తలుపులు మూసేశాం..!

న్యూఢిల్లీ: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) ఏ క్షణంలోనైనా తిరిగి ఎన్‌డీఏ (NDA)లోకి వస్తారంటూ కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే (Ramdas Athawale) చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాజ్యసభ ఎంపీ సుశీల్ మోదీ (Sushil Modi) తోసిపుచ్చారు. నితీష్ రావాలనుకున్నా బీజేపీ అందుకు సిద్ధంగా ఏమీ లేదని అన్నారు.


''రామ్‌దాస్ అథవాలే బీజేపీ ప్రతినిధి కానీ, ఎన్డీయే ప్రతినిధి కానీ కాదు. ఆయన ఒక పార్టీ నేత. కేంద్రంలో ఒక మంత్రి. నితీష్ వస్తారని ఆయన చెప్పారంటే అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. కానీ బీజేపీ ఆయనకు (నితీష్) అన్ని తలుపులు మూసేసింది. బీహార్‌లో మహాకూటమికి కూడా ఆయన భారం కావచ్చు. ఆర్జేడీ ఆయనను ఎంతోకాలం భరిస్తుందని కూడా నేను అనుకోవడం లేదు'' అని సుశీల్ మోదీ చెప్పారు.


నితీష్‌‌ పేరుతో ఓట్లు వచ్చే రోజులు పోయాయి..

ప్రజల ఓట్లను రాబట్టుకునే సామర్థ్యం నితీష్ కుమార్ కోల్పోయారని సుశీల్ మోదీ అన్నారు. గత విధానసభ ఎన్నికల్లో ప్రచారానికి నరేంద్ర మోదీ రాకుంటే ఆయన (నితీష్) 44 సీట్లు గెలిచేవారే కాదని అన్నారు. రాజకీయాల్లో ఓట్లను రాబట్టుకునే సత్తా ఉంటేనే ఆ నాయకుడికి విలువ ఉంటుంది. లేదంటే ఎలాంటి విలువా ఉండదు'' అని సుశీల్ మోదీ వ్యాఖ్యానించారు. కాగా, దీనికిముందు, ఏ క్షణంలోనైనా నితీష్ తిరిగి ఎన్డీయేలో చేరవచ్చని, ఆయన తమ (ఎన్డీయే) వాడని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేయగా, దానిని జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రఘుబర్ దాస్ (Raghubar Das) బలపరిచారు. నితీష్ మొదట్నించీ ఎన్డీయే భాగస్వామిగా ఉన్నందున ఆయన రామ్‌దాస్ అథవాలేతో మాట్లాడి ఉండవచ్చని, ఏదో విషయం కూడా చెప్పి ఉండవచ్చని రఘుబర్ దాస్ తెలిపారు.

Updated Date - 2023-07-30T18:20:49+05:30 IST