Election Result: చరిత్ర సృష్టించిన బీజేపీ నేత.. ప్రచారం చేయకుండానే తొమ్మిదోసారి విజయం
ABN , First Publish Date - 2023-12-04T19:29:12+05:30 IST
ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఎంత హడావుడి చేస్తారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఓటర్లను ఆకర్షించేందుకు తారాస్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రత్యర్థుల వైఫల్యాలను ఎండగడుతూ.. ఎన్నో హామీలు ఇస్తారు.
BJP Gopal Bhargava: ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఎంత హడావుడి చేస్తారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఓటర్లను ఆకర్షించేందుకు తారాస్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రత్యర్థుల వైఫల్యాలను ఎండగడుతూ.. ఎన్నో హామీలు ఇస్తారు. అవసరమైతే ప్రజల మధ్యలోకి వెళ్లి.. వారితో కలిసి ఆయా పనుల్లో పాల్గొంటూ, వారికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తారు. కానీ.. ఒక రాజకీయ నాయకుడు మాత్రం ఒక్కసారి కూడా ప్రచారం చేయకుండానే ఏకంగా తొమ్మిదోసారి విజయఢంకా మోగించారు.
ఆ నాయకుడి పేరు గోపాల్ భార్గవ. ఎన్నికల సమయంలో ప్రచారం చేయని నేతగా ప్రసిద్ధి చెందిన ఆయన.. మధ్యప్రదేశ్‌లోని రెహ్లీ స్థానం వరుసగా తొమ్మిదో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతి పటేల్‌పై ఏకంగా 72,800 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కొత్త అసెంబ్లీలో అత్యంత అనుభవజ్ఞుడైన శాసనసభ్యుడు ఆయనే. గోపాల్ భార్గవ తొలిసారి కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ హయాంలో 1985లో రెహ్లీ నుంచి గెలుపొందారు. ఇక అప్పటి నుంచి గత 38 ఏళ్లుగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందుతూ.. ఇప్పటిదాకా అజేయంగా నిలిచారు. 2003 నుంచి వివిధ శాఖల్లో కేబినెట్ మంత్రిగా ఉన్న ఆయన.. ఐదేళ్లూ ప్రజల కోసం పని చేస్తానని నమ్ముతున్నందున ప్రచారం చేయాల్సిన అవసరం లేదని చెప్పారు.
గోపాల్ భార్గవ మొత్తం తొమ్మిదిసార్లు ఒకే స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందగా.. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దివంగత బాబులాల్ గౌర్ భోపాల్‌లోని గోవింద్‌పురా నుంచి వరుసగా ఎనిమిదిసార్లు గెలిచారు. అలాగే.. రాష్ట్ర రాజధానిలోని భోపాల్ సౌత్ (ప్రస్తుతం భోపాల్ సౌత్-వెస్ట్) స్థానం నుండి రెండు సార్లు ఎన్నికయ్యారు. బీజేపీ చెందిన మరో మాజీ ముఖ్యమంత్రి దివంగత కైలాష్ జోషి కూడా దేవాస్ జిల్లాలోని బాగ్లీ స్థానం నుంచి 1962 - 1993 మధ్య ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు.