DK Shivakumar: పట్టుబడిన రూ.94 కోట్లు బీజేపీవే..
ABN , First Publish Date - 2023-10-17T16:53:47+05:30 IST
ఆదాయం పన్ను శాఖ కర్ణాటక లోని ప్రభుత్వ కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ డవలపర్ల కార్యాలయాలపై జరిపిన దాడుల్లో పట్టుబడిన రూ.94 కోట్లు బీజేపీవేనని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.జేపీ నడ్డా సారథ్యంలో బీజేపీ 'అవినీతికి ఫౌండేషన్' అని డీకే అభివర్ణించారు.
బెంగళూరు: ఆదాయం పన్ను శాఖ (Income Tax Department) కర్ణాటక (Karnataka)లోని ప్రభుత్వ కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ డవలపర్ల కార్యాలయాలపై జరిపిన దాడుల్లో పట్టుబడిన రూ.94 కోట్లు బీజేపీవేనని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) అన్నారు. పట్టుబడిన సొమ్ముతో కాంగ్రెస్‌కు సంబంధాలున్నాయంటూ బీజేపీ చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. జేపీ నడ్డా సారథ్యంలో బీజేపీ 'అవినీతికి ఫౌండేషన్' అని డీకే అభివర్ణించారు.
'అవినీతి అంతా బీజేపీదే. అవినీతికి ఫౌండేషన్ ఆ పార్టీ. ఆ కారణంగానే ఆ పార్టీని కర్ణాటక ప్రజలు గెంటివేశారు. పట్టుబడిన సొమ్ముకు బీజేపీ నేతలతో సంబంధాలున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు'' అని డీకే మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
ఈనెల 12న ఆదాయం పన్ను శాఖ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, న్యూఢిల్లీలోని పలు ప్రభుత్వ కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ డవలపర్ల కార్యాలయాలపై దాడులు జరిపారు. లెక్కల్లో చూపించని రూ.94 కోట్ల నగదు, రూ.8 కోట్లు విలువచేసే స్వర్ణ, వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. 30 ఖరీదైన రిస్ట్‌వాచ్‌లను కూడా కనుగొన్నారు. కర్ణాటక కాంట్రాక్టర్ అంబికాపతి సన్నిహితుడి నివాసం నుంచి రూ.42 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై గత ఏడాది ప్రధాన మంత్రికి లేఖలు రాసిన కాంట్రాక్టర్లలో అంబికాపతి కూడా ఉన్నారు. ఆదివారంనాడు కర్ణాటకలోని మరో బిల్టర్ సంతోష్ కృష్ణప్ప నివాసం నుంచి రూ.40 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఖర్చుల కోసం కర్ణాటక ఏటీఎం మిషన్‌గా మారిందని, పట్టుబడిన మొత్తం కాంగ్రెస్‌దేనని బీజేపీ ఆరోపించింది. ఎన్నికల కోసం కర్ణాటక నుంచే సొమ్ములు వెళ్తున్నాయని తాము గతంలో చేసిన ఆరోపణలే నిజమయ్యాయని పేర్కొంది. దీనిపై సీబీఐ దర్యాప్తు జరపాలని బీజేపీ నేత సీటీ రవి డిమాండ్ చేశారు.
డీకేకు బీజేపీ సవాల్
ఆదాయం పన్ను శాఖ దాడుల్లో పట్టుబడిన సొమ్ముతో బీజేపీ నేతలకు సంబంధాలున్నాయంటూ డీకే శివకుమార్ చేసిన ఆరోపణలను కమలనాథులు తోసిపుచ్చారు. బీజేపీదే సొమ్ము అయితే దర్యాప్తు జరిపించాలని, ఆధారాలతో నిరూపించాలని, పట్టుబడిన సొమ్ము ఎవరిదైతే వారిపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేత సదానంద గౌడ డిమాండ్ చేశారు.