Women's reservatin Bill: కాంగ్రెస్‌కు బీజేపీ ఎప్పుడూ క్రెడిట్ ఇవ్వలేదు: మహిళా బిల్లుపై ఖర్గే
ABN , First Publish Date - 2023-09-19T18:51:16+05:30 IST
మహిళా రిజర్వేషన్లపై నరేంద్ర మోదీ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టినప్పటికీ వారి హయాంలో వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ తెగల మహిళలకు కీలకమైన అవకాశాలేమీ దక్కలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును తొలిసారి ప్రవేశపెట్టినది కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వమే అయినా ఎప్పుడూ ఎన్డీయే ప్రభుత్వం తమకు క్రెడిట్ ఇవ్వలేదని ఆక్షేపించారు.
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్లపై నరేంద్ర మోదీ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టినప్పటికీ, మహిళా సాధికారతపై పెద్దపెద్ద మాటలు చెప్పినప్పటికీ వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ తెగల మహిళలకు కీలకమైన అవకాశాలేమీ దక్కలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును తొలిసారి ప్రవేశపెట్టినది కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వమే అయినా ఎప్పుడూ వారికి ఎన్డీయే ప్రభుత్వం క్రెడిట్ ఇవ్వలేదని ఆక్షేపించారు.
''వాళ్లు మాకు ఎప్పుడూ క్రెడిట్ ఇవ్వలేదు. 2010లోన మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినప్పటికీ అది నిలిచిపోయిన విషయాన్ని వారి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను'' అని ఖర్గే అన్నారు. షెడ్యూల్డ్ కులాలలో అక్షరాస్యతా శాతం తక్కువగా ఉండటంతో బలహీనమైన మహిళలనే రాజకీయ పార్టీలు ఎంచుకోవడం అలవాటుగా పెట్టుకున్నాయని, చదువుకున్న వాళ్లను, పోరాటపటమి కలవారిని ఎప్పూడు వాళ్లు ఎంచుకోలేదని విమర్శించారు.
నిర్మలా సీతారామన్ అభ్యంతరం
మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళా అభ్యర్థుల సమర్ధతను తక్కువ చేసి మాట్లాడటం తమకు ఆమోదయోగ్యం కాదని అన్నారు. విపక్షనేతను తాము గౌరవిస్తున్నామనీ, కానీ, అంతగా సామర్థ్యం లేని మహిళలను మాత్రమే అన్ని పార్టీలు ఎంచుకుంటున్నాయనేది మాత్రం ఏమాత్రం సబబు కాదని అన్నారు. బీజేపీ తమందరికీ సాధికారత కల్పించిందని, మహిళా సాధికారతకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరో ఉదాహరణ అని చెప్పారు.