Akshay Kumar: ఎట్టకేలకు అక్షయ్ కుమార్‌కు మోక్షం.. భారతీయ పౌరసత్వం లభ్యం

ABN , First Publish Date - 2023-08-15T16:00:00+05:30 IST

బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడైన అక్షయ్ కుమార్‌కు ఎట్టకేలకు భారతీయ పౌరసత్వం లభించింది. పౌరసత్వ విషయంలో తరచూ విమర్శలు ఎదుర్కుంటున్న అక్షయ్..

Akshay Kumar: ఎట్టకేలకు అక్షయ్ కుమార్‌కు మోక్షం.. భారతీయ పౌరసత్వం లభ్యం

బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడైన అక్షయ్ కుమార్‌కు ఎట్టకేలకు భారతీయ పౌరసత్వం లభించింది. పౌరసత్వ విషయంలో తరచూ విమర్శలు ఎదుర్కుంటున్న అక్షయ్.. ఇప్పుడు తనకు లభ్యమైన పౌరసత్వంతో ఆ విమర్శలకు చెక్ పెట్టినట్లయ్యింది. తనకు ఇండియన్ సిటిజన్‌షిప్ లభించినట్లు అక్షయ్ కుమార్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ట్విటర్ వేదికగా వెల్లడించాడు. ‘నా హృదయం, పౌరసత్వం.. రెండూ హిందుస్థానీ. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్’ అంటూ ట్వీట్ చేశాడు.


కాగా.. తనకు కెనడా పౌరసత్వం ఉందని గతంలో అక్షయ్ కుమార్ వెల్లడించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. 1990ల్లో తాను నటించిన 15 సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో.. గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అప్పుడు కెనడాలో ఉండే ఒక స్నేహితుడు అక్కడికి రావాలని తనకు సలహా ఇచ్చాడని, అతని సూచన మేరకు కెనడా వెళ్లి పని చేసుకోవాలని నిర్ణయించుకున్నానని అక్షయ్ తెలిపాడు. అందుకోసమే తాను కెనడా పాస్‌పోర్ట్ దరఖాస్తు చేసుకున్నానని అన్నాడు. అయితే.. ఇంతలోనే తాను చేసిన రెండు సినిమాలు భారత్‌లో ఘనవిజయం సాధించడంతో, కెనడాకి వెళ్లాల్సిన అవసరం తనకు రాలేదన్నాడు. అప్పటి నుంచి భారత్‌లోనే సినిమాలు చేసుకుంటూ ఉండిపోయానని, ఈ క్రమంలోనే తాను పాస్‌పోర్ట్ విషయం మర్చిపోయానని ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

2019 ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీని అక్షయ్ ఇంటర్వ్యూ చేసినప్పుడు.. కెనడా పౌరసత్వం కలిగి ఉండటంపై అతని మీద తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఓటు హక్కు లేని వ్యక్తితో ప్రధాని ఎలా ఇంటర్వ్యూ చేస్తారన్న ప్రశ్నలూ లేవనెత్తాయి. అదే టైంలో ప్రతీ భారతీయుడు ఓటు హక్కు వినియోగించుకోవాలని అక్షయ్ చెప్పడంతో.. అతనిపై మరిన్ని విమర్శలు వచ్చిపడ్డాయి. అసలు భారతీయ పౌరసత్వమే లేనివాడు, ఓటు హక్కు కోసం పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అప్పుడు తాను పాస్ట్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నానని అక్షయ్ పలుమార్లు వెల్లడించాడు. అయితే.. కొవిడ్ కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పుడు 77వ స్వాతంత్రం దినోత్సవం సందర్భంగా అతనికీ పౌరసత్వం విషయంలో స్వాతంత్రం లభించింది.

Updated Date - 2023-08-15T16:00:00+05:30 IST