Asaduddin Owasi: ఇందిరా గాంధీ శకం వెనక్కి తేవాలనుకుంటున్నారా?.. కేంద్రాన్ని నిలదీసిన ఒవైసీ
ABN , First Publish Date - 2023-02-08T16:26:12+05:30 IST
న్యాయమూర్తుల నియామక ప్రక్రియపై జరుగుతున్న రచ్చపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కేంద్రాన్ని పార్లమెంటులో..
న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామక ప్రక్రియపై జరుగుతున్న రచ్చపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) కేంద్రాన్ని పార్లమెంటులో బుధవారంనాడు నిలదీశారు. రాజ్యాంగ మౌలిక వ్యవస్థపై రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు కామెంట్లు చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇందిరాగాంధీ శకాన్ని' (Indira Gandhi era) వెనక్కి తెస్తోందని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో ఒవైసీ పాల్గొంటూ, మైనారిటీలకు ప్రభుత్వం తగినంత చేయడంలేదని అన్నారు. ఇండియా-చైనా సరిహద్దు పరిస్థితులపైనా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
''రాజ్యాంగ మౌలిక వ్యవస్థపై రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు విమర్శలు చేస్తున్నారు. కొలీజియంపై న్యాయశాఖ మంత్రి కామెంట్లు చేస్తున్నారు. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ (ఎన్‌జేఏసీ) బిల్లు సభకు వచ్చినప్పుడు ఈ బిల్లు రాజ్యంగ మౌలిక వ్యవస్థకు వ్యతిరేకమని చెప్పిన ఏకైక ఏంపీని నేను'' అని ఒవైసీ గుర్తు చేశారు.
''ఇందిరాగాంధీ నుంచి మీరు పాఠాలు నేర్చుకోవాలి. జ్యూడిషియరీ నన్ను అనుసరించాలని ఇందిరా గాంధీ అన్నారు. ఇప్పడు జ్యుడిషియరీ తనకు విధేయంగా ఉండాలని ప్రధాన మంత్రి మోదీ అంటున్నారు. మీరు ఇందిరాగాంధీ శకాన్ని తిరిగి తీసుకువస్తున్నారు'' అని ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మైనారిటీలను పట్టించుకోవడం లేదు...
మైనారిటీలకు ప్రభుత్వం తగినంత చేయడం లేదని, మైనారిటీలకు బడ్జెట్‌లో 40 శాతం కోతలు పెట్టారని ఒవైసీ అన్నారు. జనాభాలో 19 శాతం ఉన్న మైనారిటీ జనాభా ప్రసక్తే రాష్ట్రపతి ప్రసంగంలో చోటుచేసుకోలేదని పేర్కొన్నారు. ముస్లింల పిల్లలు చదువుకోవాలని మోదీ ప్రభుత్వం కోరుకోవడం లేదని, వారిని పేదరికం బాధితులుగా చేయాలనుకుంటోందని ఆరోపించారు. బిల్కిస్ బానో ప్రస్తావన చేస్తూ, 20 ఏళ్లుగా ఆమె న్యాయం కోసం పోరాడుతూనే ఉందని, అయినా ఆమెకు న్యాయం ఎండమావిగానే ఉందని, అందుకు కారణం ఆమె పేరు బిల్కిస్ బానో కావడమేనని విమర్శలు గుప్పించారు.
చైనాకు ప్రభుత్వం భయపడుతోంది..
చైనాకు ప్రభుత్వం భయపడుతోందని ఒవైసీ ఆరోపించారు. ''చైనా పేరును ప్రధాని ప్రస్తావిస్తారా? 65 పెట్రోలింగ్ పాయింట్లలో 26 పెట్రోలింగ్ పాయింట్లలో ఇండియా పెట్రోలింగ్ జరపడం లేదు. మీరు చైనాను చూసి భయపడుతున్నారు'' అని ఒవైసీ వ్యాఖ్యానించారు.