By-Elecctions 2023: 6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికల తేదీని ప్రకటించిన ఈసీ
ABN , First Publish Date - 2023-08-08T20:12:31+05:30 IST
ఆరు రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల తేదీని ఎన్నికల కమిషన్ సోమవారంనాడు ప్రకటించింది. సెప్టెంబర్ 5న ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతుందని ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది. ఉప ఎన్నికలను ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో జార్ఖాండ్, త్రిపుర, కేరళ, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఉన్నాయి.
న్యూఢిల్లీ: ఆరు రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల(By-Elections) తేదీని ఎన్నికల కమిషన్ (Election Commission) సోమవారంనాడు ప్రకటించింది. సెప్టెంబర్ 5న ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతుందని ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది. ఉప ఎన్నికలను ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో జార్ఖాండ్, త్రిపుర, కేరళ, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఉన్నాయి. వివిధ కారణాల రీత్యా ఈ రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు ఖాళీ ఏర్పడినట్టు ఈసీ తెలిపింది. ఉప ఎన్నికలు జరిగే అన్ని పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంలు, వీవీపాట్‌లను వినియోగించనున్నామని, పోలింగ్ సజావుగా జరిగేందుకు వీలుగా తగినన్ని ఈవీఎంలు, వీవీపాట్‌లు ఏర్పాటు చేస్తామని ఈసీ తెలిపింది.
ఏడు అసెంబ్లీ స్థానాలివే...
ఉప ఎన్నికలు జరుగనున్న స్థానాల్లో జార్ఖాండ్‌లోని డుమ్రి అసెంబ్లీ నియోజకవర్గం, కేరళలోని పుదుపల్లి, త్రిపురలోని బాక్సానగర్, ధన్‌పూర్, పశ్చిమబెంగాల్‌లోని ధూప్‌గురి ఎస్‌సీ అసెంబ్లీ నియోజకవర్గం, ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్, ఉత్తరప్రదేశ్‌లోని ఘోసి అసెంబ్లీ నియోజకవర్గం ఉన్నాయి.
షెడ్యూల్ ఇదే..
ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, ఆరు రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు ఆగస్టు 10వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ వెలువడుతుంది. నామినేషన్ల దాఖలు గడవు ఆగస్టు 17వ తేదీతో ముగుస్తుంది. 18వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణ గడవు 21వ తేదీతో ముగుస్తుంది. సెప్టెంబర్ 5న పోలింగ్, 8వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. సెప్టెంబర్ 10వ తేదీలోపు మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగియాల్సి ఉంటుంది.