Bypolls 2023: తొలి పోరులో ఎన్డీయేకు-3, ఇండియాకు-4

ABN , First Publish Date - 2023-09-08T20:58:37+05:30 IST

ఆరు రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేపై పోరాటానికి కొత్తగా విపక్షాల ఇండియా కూటమి ఆవిర్భవించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవే కావడంతో ఫలితాలు ఆసక్తికరంగా మారాయి.ఎన్డీయే కూటమి 3 స్థానాల్లో గెలుపొందగా, 'ఇండియా' కూటమి 4 స్థానాలు కైవసం చేసుకుంది.

Bypolls 2023: తొలి పోరులో ఎన్డీయేకు-3, ఇండియాకు-4

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అంతా ఆసక్తి ఎదురుచూసిన 6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల(Bypolls 2023) ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే (NDA)పై పోరాటానికి కొత్తగా విపక్షాల ఇండియా (I.N.D.I.A.) కూటమి ఆవిర్భవించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవే కావడంతో ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. సెప్టెంబర్ 5న జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు శుక్రవారం ఉదయం ప్రారంభమై సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెలువడ్డాయి. ఎన్డీయే కూటమి 3 స్థానాల్లో గెలుపొందగా, 'ఇండియా' కూటమి 4 స్థానాలు కైవసం చేసుకుంది. విపక్ష 'ఇండియా' కూటమి పక్షాలైన కాంగ్రెస్, జేఎంఎం, టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ చెరో సీటు చొప్పున మొత్తం నాలుగు సీట్లు గెలుచుకున్నాయి.


ఎన్డీయే గెలుపొందిన స్థానాలివే...

త్రిపురలో ఉప ఎన్నికలు జరిగిన రెండు స్థానాలో కమలనాథులు విజయం సాధించారు. బాక్సానగర్ సీటు నుంచి బీజేపీ అభ్యర్థి తఫజ్జల్ హొస్సేన్ 30,237 ఓట్లతో గెలుపొందారు. ఆయనకు 34,146 ఓట్లు పోల్ కాగా, ఆయన సమీప సీపీఎం ప్రత్యర్థికి 3,909 ఓట్లు వచ్చాయి. ధన్‌రూక్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి బింబు దేబ్‌నాథ్ 18.871 ఓట్లు ఆధిక్యంతో గెలుపొందారు. డేబ్‌నాథ్‌కు 30,017 ఓట్లు లభించగా, సమీప సీపీఎం ప్రత్యర్థి 11,146 ఓట్లు సాధించారు. కాగా, ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్ నుంచి బీజేపీ గెలుపు సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి పార్వతి దాస్ 2,405 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. ఆమెకు 33,247 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి 30,842 ఓట్లు సాధించారు.


'ఇండియా' కూటమి గెలిచిన స్థానాలివే...

ఇండియా కూటమి నాలుగు స్థానాలు గెలుచుకుంది. పశ్చిమబెంగాల్‌లోని ధూప్‌గురిలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అభ్యర్థి నిర్మలా చంద్ర రాయ్ 4,000 పైచిలుకు ఓట్ల ఆధిక్యతతో బీజేపీ అభ్యర్థిపై గెలుపొందారు. కేరళలోని పుతుప్పల్లి ఉప ఎన్నికలో కాంగ్రెస్ చారిత్రక విజయాన్ని సాధించింది. ఆ పార్టీ అభ్యర్థిగా నిలబడి చాందీ ఊమన్ 37,000 పైచిలుకు ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. చాందీ ఊమన్‌కు 80,144 ఓట్లు, సీపీఎం అభ్యర్థి జేసీ థామస్‌కు 42,425 ఓట్లు, బీజేపీ అభ్యర్థి లిగిన్ లాల్‌కు 6,558 ఓట్లు పోలయ్యాయి. కేరళ ఉప ఎన్నికల్లో ఇంతవరకూ 37 వేల పైచిలుకు ఆధిక్యతతో ఒక అభ్యర్థి గెలుపొందడం ఇదే ప్రథమం. కాగా, జార్ఖండ్‌‌లోని డుమ్రి అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా అభ్యర్థి బేబీ దేవి 17,000 ఓట్ల ఆధిక్యంతో ఎన్డీయే అభ్యర్థి యశోదా దేవిపై గెలుపొందారు. బేబీ దేవికి ఈ ఉప ఎన్నికలో 1,00,317 ఓట్లు రాగా, ఎన్డీయే అభ్యర్థి యశోదా దేవికి 83,164 ఓట్లు వచ్చాయి. యోగి ఆదిత్యనాథ్ కంచుకోట అయిన యూపీలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) అభ్యర్థి సుధాకర్ సింగ్ గెలుపొందారు. ఆయనకు 1,24,427 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి దారా సింగ్ చౌహాన్‌కు 81,668 ఓట్లు వచ్చాయి.

Updated Date - 2023-09-08T21:02:49+05:30 IST