Lok Sabha: మహిళల తరఫున పురుషులు మాట్లాడకూడదా?.. అధీర్ రంజన్‌కు అమిత్‌షా కౌంటర్..!

ABN , First Publish Date - 2023-09-20T16:53:58+05:30 IST

మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో బుధవారంనాడు చర్చ సందర్భంగా ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. బీజేపీ ఎంపీ నిషికాంత్ డూబే మాట్లాడుతుండగా ఆయన ప్రసంగానికి కాంగ్రెస్ విపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి అంతరాయం కలిగించారు. దీంతో హోం మంత్రి అమిత్‌షా జోక్యం చేసుకుని ''మహిళల తరఫున పురుషులు మాట్లాడకూడదా?'' అని ప్రశ్నించారు.

Lok Sabha: మహిళల తరఫున పురుషులు మాట్లాడకూడదా?.. అధీర్ రంజన్‌కు అమిత్‌షా కౌంటర్..!

న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లు (Women's Reservation Bill)పై లోక్‌సభలో బుధవారంనాడు చర్చ సందర్భంగా ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. బీజేపీ ఎంపీ నిషికాంత్ డూబే (Nishikant Dubey) మాట్లాడుతుండగా ఆయన ప్రసంగానికి కాంగ్రెస్ విపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి అంతరాయం కలిగించారు. దీంతో హోం మంత్రి అమిత్‌షా (Amit shah) జోక్యం చేసుకుని ''మహిళల తరఫున పురుషులు మాట్లాడకూడదా?'' అని ప్రశ్నించారు. తొలుత ప్రసంగించే అవకాశం రాకపోవడంతో ఆయన (Adhir Ranjan) అసూయపడుతున్నట్టు కనిపిస్తోదంటూ ఛలోక్తులు విసిరారు.


'నారీ శక్తి వందన్ అధినియం'పై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ మాట్లాడిన అనంతరం బీజేపీ ఎంపీ నిశికాంట్ దూబే ప్రసంగించేందుకు నిలబడ్డారు. ఆ వెంటనే మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడేందుకు ప్రభుత్వం ఒక మహిళా ఎంపీని నామినేట్ చేయాలని అధీర్ రంజన్, ఇతర ఎంపీలు డిమాండ్ చేశారు. దీంతో సభలో కొద్దిసేపు గందరగోళం తలెత్తింది. దీంతో అమిత్‌షా జోక్యం చేసుకున్నారు. డూబే ప్రసంగాన్ని అడ్డుకోవడంపై నిలదీస్తూ, మొదటిగా ప్రసంగించేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో అధీర్ రంజన్ అసూయపడుతున్నట్టు కనిపిస్తోందని అన్నారు.


''అధీర్ రంజన్‌ను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. మహిళల పట్ల మహిళలే జాగ్రత్తలు తీసుకోవాలా? వారి గురించి పురుషులు మాట్లాడకూడదా? మీరు ఏ తరహా సమాజాన్ని కోరుకుంటున్నారు? మహిళా సంక్షేమం, మహిళా అంశాల విషయంపై సోదరులు (Brothers) ఒక అడుగు ముందుంటారు. అది మన దేశ సంప్రదాయం. మహిళా సంక్షేమం గురించి ఆలోచించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. మా (బీజేపీ) తరఫున నిషికాంత్ మాట్లాడాలనుకుంటే మీకున్న (అధీర్) అభ్యంతరం ఏమిటి? మీకు మొదటగా మాట్లాడేందుకు అవకాశం రాలేదు. అందువల్ల కొద్దిపాటి అసూయగా ఉన్నట్టు కనిపిస్తోంది'' అని అమిత్‌షా నవ్వుతూ ఛలోక్తులు విసిరారు.


మహిళా రిజర్వేషన్ బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారంనాడు లోక్‌సభలో ప్రవేశపెట్టగా, బుధవారం మధ్యాహ్నం 11 గంటల నుంచి బిల్లుపై చర్చ మొదలైంది. బిల్లుపై సోనియాగాంధీ చర్చను ప్రారంభిస్తూ, బిల్లుకు తమ పార్టీ మద్దతిస్తోందని, తక్షణం దీనిని అమలు చేయాలని కోరారు. బిల్లు అమలులో జాప్యం జరిగితే అది దేశంలోని మహిళలకు అన్యాయం జరిగినట్టే అవుతుందని అన్నారు. కాగా, ఈ బిల్లును రాజ్యసభలో గురువారం ప్రవేశపెట్టనున్నారు.

Updated Date - 2023-09-20T16:53:58+05:30 IST