Share News

Parliament Breach: కేంద్రం కీలక నిర్ణయం.. పార్లమెంట్ భద్రత CISFకు అప్పగింత

ABN , Publish Date - Dec 21 , 2023 | 05:10 PM

Parliament Breach: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ సముదాయంలో సమగ్ర భద్రత బాధ్యతలను ఢిల్లీ పోలీసులకు కాకుండా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)కు అప్పగించాలని కేంద్రం నిర్ణయించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Parliament Breach: కేంద్రం కీలక నిర్ణయం.. పార్లమెంట్ భద్రత CISFకు అప్పగింత

ఇటీవల లోక్‌సభలో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా అలజడి సృష్టించింది. కొందరు వ్యక్తులు ఎంపీ విజిటర్ పాసులతో లోక్‌సభలోకి వెళ్లి అనంతరం గ్యాలరీ నుంచి కిందకు దూకి రంగుల పొగ వదిలి పెద్ద దుమారం సృష్టించారు. దీంతో పార్లమెంట్‌లో భద్రత కరువైందని విపక్షాలు విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ సముదాయంలో సమగ్ర భద్రత బాధ్యతలను ఢిల్లీ పోలీసులకు కాకుండా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)కు అప్పగించాలని కేంద్రం నిర్ణయించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. CISF అనేది కేంద్ర సాయుధ పోలీస్ దళం. ప్రస్తుతం CISF అనేక కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని పలు శాఖల భవనాలు, ఏరో స్పేస్ డొమైన్, సివిల్ ఎయిర్‌పోర్టుల భద్రతను పర్యవేక్షిస్తోంది. ఇప్పుడు పార్లమెంట్ భద్రత బాధ్యత కూడా CISFకు కేంద్రం అప్పగించింది.

కాగా పార్లమెంట్ సముదాయంలోని అన్ని భవనాల భద్రతపై సమగ్ర సర్వే చేపట్టాలని CISFకు కేంద్ర హోంశాఖ బుధవారం ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సర్వేను CISF అధికారులు చేపట్టారని.. ఈ సర్వే ముగిసిన తర్వాత పార్లమెంట్ ప్రాంగణంలో CISF సిబ్బందిని నియమించనున్నట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. అయితే ఈ సర్వేలో CISF సిబ్బందితో పాటు పార్లమెంట్ భద్రతను పర్యవేక్షిస్తున్న పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీస్, సీఆర్పీఎఫ్‌కు చెందిన పార్లమెంట్ డ్యూటీ గ్రూప్ బృందాలు, ఢిల్లీ పోలీసులు కూడా పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు.


మరిన్ని నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 21 , 2023 | 05:10 PM