Chennai: రూ.1000 పథకానికి అద్దె ఇళ్లలోని గృహిణులూ అర్హులే..

ABN , First Publish Date - 2023-07-22T07:33:24+05:30 IST

బియ్యం రేషన్‌కార్డులు కలిగి ఉన్న నిరుపేద గృహిణులకు ప్రతినెలా రూ.1000 చెల్లించే పథకానికి అద్దె ఇళ్లలో నివసిస్తున్న గృహిణులు కూడా అర్హులేనని,

Chennai: రూ.1000 పథకానికి అద్దె ఇళ్లలోని గృహిణులూ అర్హులే..

- కార్పొరేషన్‌ కమిషనర్‌ రాధాకృష్ణన్‌ ప్రకటన

- తొలిరోజే రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల దరఖాస్తుల పంపిణీ

చెన్నై, (ఆంధ్రజ్యోతి): బియ్యం రేషన్‌కార్డులు కలిగి ఉన్న నిరుపేద గృహిణులకు ప్రతినెలా రూ.1000 చెల్లించే పథకానికి అద్దె ఇళ్లలో నివసిస్తున్న గృహిణులు కూడా అర్హులేనని, వారికీ దరఖాస్తులను పంపిణీ చేస్తామని గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ డాక్టర్‌ జె.రాధాకృష్ణన్‌(Greater Chennai Corporation Commissioner Dr. J. Radhakrishnan) తెలిపారు. స్థానిక చింతాద్రిపేట సామాజిక కేంద్రంలో లబ్ధిదారుల ఎంపికకు దరఖాస్తుల పంపిణీని ఆయన శుక్రవారం పరిశీలించారు. ఆ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... నగరంలోని 703 రేషన్‌షాపు పరిధిలో ఉన్న గృహిణులకు దరఖాస్తులు అందజేశామని, తొలిరోజు 15 శాతం మందికి పంపిణీ చేశామన్నారు. శిబిరాల్లో పనిచేసే సిబ్బందికి తగిన శిక్షణ అందించామని, అంతేకాకుండా ప్రతి 500 మంది గృహిణులకు ఒక శిబిరం చొప్పున ఏర్పాటు చేశామని చెప్పారు. 2500 రేషన్‌కార్డులు కలిగిన రేషన్‌ షాపుల వద్ద ఐదు శిబిరాలు నిర్వహిస్తామన్నారు. శిబిరాలు నిర్వహించే చోట విద్యుత్‌ సరఫరాకు అంతరాయం తలెత్తకుండా ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. ఖాతాలు లేనివారికి సహకార బ్యాంకుల్లో ఖాతాలను ప్రారంభింపజేస్తామన్నారు. ఆధార్‌కార్డ్‌, విద్యుత్‌ బిల్లుల చెల్లింపు కార్డును శిబిరాలకు తీసుకురావాలని ప్రభుత్వం ప్రకటించిందని, అద్దె ఇళ్లలో నివసిస్తున్నవారు కూడా ఈ పథకానికి అర్హులేనన్నారు. వారి వద్ద విద్యుత్‌ చెల్లింపు బిల్లులు లేకపోయినా పరవాలేదన్నారు. శిబిరాల్లో దరఖాస్తుల పంపిణీ త్వరగా జరిగేందుకు అనువుగా 2300 బయోమెట్రిక్‌ పరికరాలను కూడా సిద్ధంగా ఉంచామన్నారు.

తొలి రోజే...

రాష్ట్రవ్యాప్తంగా గురువారం 25 లక్షలమంది గృహిణులకు కలైంజర్‌ మహిళా సాధికారిక నగదు చెల్లింపు పథకం దరఖాస్తులను పంపిణీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. జీసీసీ పరిధిలో 10 లక్షల మంది గృహిణులకు దరఖాస్తులను పంపిణీ చేయాల్సి ఉందని, గురువారం 1.5లక్షల మందికి దరఖాస్తులను అందించామని కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రానికల్లా 90శాతం మంది గృహిణులకు దరఖాస్తుల పంపిణీ పూర్తి చేయాలని, తక్కిన వారికి ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా దరఖాస్తులు అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

nani2.2.jpg

Updated Date - 2023-07-22T07:54:36+05:30 IST