Chennai: చెన్నైలో మహా వంతెన
ABN , First Publish Date - 2023-08-05T10:32:13+05:30 IST
ట్రాఫిక్ రద్దీ నియంత్రించేలా చెన్నై నగరంలో అన్నాసాలై నుంచి టి.నగర్ మీదుగా కోడంబాక్కం మహాలింగాపురం వరకు 4 కి.మీ దూరం మేర భారీ
- అన్నాసాలై - టి.నగర్ - కోడంబాక్కం మధ్య 4 కి.మీ మేర భారీ బ్రిడ్జి
పెరంబూర్(చెన్నై): ట్రాఫిక్ రద్దీ నియంత్రించేలా చెన్నై నగరంలో అన్నాసాలై నుంచి టి.నగర్ మీదుగా కోడంబాక్కం మహాలింగాపురం వరకు 4 కి.మీ దూరం మేర భారీ వంతెన నిర్మితం కానుంది. ఇది పూర్తయితే చెన్నైలో ఇదే అతిపెద్ద బ్రిడ్జి. చెన్నై నగరం(Chennai city) సమీపంలోని చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూర్(Chengalpattu, Kanchipuram, Thiruvallur) జిల్లాలకు కూడా విస్తరిస్తోంది. అలాగే, ప్రజలు వాహనాల వినియోగం అధికం కావడంతో చెన్నైలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ట్రాఫిక్ రద్దీ నియంత్రణలో భాగంగా రోడ్ల విస్తరణ, పలు ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు ఏర్పాటు చేశారు. అలాగే స్థానిక సైదాపేట సీఐటీ నగర్ నుంచి టి.నగర్ ఉస్మాన్ రోడ్డు వరకు 1.2 కి.మీ దూరానికి రూ.130 కోట్లతో వంతెన నిర్మాణం జరుగుతోంది. అలాగే, అన్నాసాలైలో తేనాంపేట - సైదాపేట ప్రాంతాలను అనుసంధానం చేసేలా 3 కి.మీ దూరానికి రూ.621 కోట్లతో వంతెన ఏర్పాటు కానుంది.
ఈ నేపథ్యంలో, అన్నాసాలై సైదాపేట నుంచి సిఐటీ నగర్ మీదుగా కోడంబాక్కం మహాలింగాపురం వరకు 4 కి.మీ మేర పొడవాటి వంతెన నిర్మితం కానుంది. ఈ వంతెన కాంక్రీట్‌కు బదులుగా ఇనుప స్తంభాలతో ఏర్పాటుకానుంది. ఈ వంతెన నిర్మాణానికి చెన్నై ఐఐటీ ఫ్రొఫెసర్‌ను డిజైనర్ ఇంజనీర్‌గా నియమించారు. సైదాపేట నుంచి కోడంబాక్కం మహాలింగాపురం వెళ్లేందుకు 30 నిమిషాలు పడుతుండగా ఈ వంతెన అందుబాటులోకి వస్తే కేవలం 5 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఈ మార్గంలో నాలుగు ప్రాంతాల్లో వాహనాలు వంతెనపైకి ప్రవేశించడం, దిగడం వంటివి ఏర్పాటుకానున్నాయి. ఈ వంతెన నిర్మాణ పనులు వచ్చే ఏడాది ప్రారంభం కానున్నట్లు సమాచారం.