Chennai: ఒకటో తరగతికి కనీస వయస్సు ఐదేళ్లు

ABN , First Publish Date - 2023-08-26T08:07:32+05:30 IST

రాష్ట్రంలో 1వ తరగతిలో చేరే పిల్లల కనీస వయస్సు ఐదేళ్లుగా ఉండాలని జస్టిస్‌ మురుగేశన్‌(Justice Murugesan) కమిటీ రాష్ట్ర

Chennai: ఒకటో తరగతికి కనీస వయస్సు ఐదేళ్లు

- జస్టిస్‌ మురుగేశన్‌ కమిటీ సిఫారసు

ప్యారీస్‌(చెన్నై): రాష్ట్రంలో 1వ తరగతిలో చేరే పిల్లల కనీస వయస్సు ఐదేళ్లుగా ఉండాలని జస్టిస్‌ మురుగేశన్‌(Justice Murugesan) కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. మహోన్నత పాఠశాల పరీక్షల విధానంలో కూడా మార్పులు చేసినట్లు ఆ కమిషన్‌ ప్రకటించింది. కేంద్ర విద్యా విధానానికి భిన్నంగా రాష్ట్రానికి ప్రత్యేకంగా విద్యా విధానాలు రూపొందించనున్నట్లు గతంలో రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై అధ్యయనం చేసేందుకు హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి మురుగేశన్‌ నేతృత్వంలో 13 మంది సభ్యులతో కమిటీ నియమించింది. ఈ కమిటీ రాష్ట్రస్థాయి విద్యా విధానంలో ముసాయిదా పథకాన్ని నివేదికగా తయారుచేసి ప్రభుత్వానికి సమర్పించింది. అందులో, 1వ తరగతిలో చేరే పిల్లల కనీస వయస్సు ఐదేళ్లుగా నిర్ణయించింది. ప్రస్తుతం మూడు నుంచి ఐదేళ్లలోపు పిల్లలను ప్లే స్కూళ్లలో మాత్రమే చేర్పించే విధానం వుంది. 1వ తరగతి నుంచి రాయడం, చదవడం సాధ్యమవుతుంది. అందువల్ల ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే ఐదేళ్లు నిండిన పిల్లలను 1వ తరగతిలో చేర్చుకుంటున్నారు. అయితే ప్రైవేటు, నర్సరీ పాఠశాలల్లో మూడేళ్ల పాటు ప్రీ స్కూల్‌ విద్య అనంతరం 1, 2 తరగతులుంటాయి. పిల్లల్లో మెదడు పెరుగుదల పరిగణనలోకి తీసుకొని ఇక నుంచి ఐదేళ్లు నిండిన పిల్లలను 1వ తరగతిలో చేర్చుకోవాలని జస్టిస్‌ మురుగేశన్‌ నేతృత్వంలోని కమిటీ సిఫారసు చేసింది. అంతేకాకుండా టెన్త్‌, ప్లస్‌టూ, మూడేళ్ల డిగ్రీ కోర్సుల పరీక్షా విధానంలో మార్పులు, టీచర్లలో మేథోశక్తి పెంపు, వ్యాయామ విద్యకు ప్రాధాన్యం కల్పించడం తదితర అంశాలను కూడా ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

Updated Date - 2023-08-26T08:07:34+05:30 IST