Chennai: 6 నుంచి ఆర్థిక సాయం దరఖాస్తుల పరిశీలన
ABN , First Publish Date - 2023-08-03T09:18:19+05:30 IST
‘కలైంజర్ మహిళా హక్కు’ పథకం కింద కుటుంబంలోని మహిళా పెద్దకు ప్రభుత్వం ఇవ్వదలచిన రూ.1000 ఆర్థిక సాయం కోసం దరఖాస్తుల స్వీక
- జోరుగా అప్లికేషన్ల పంపిణీ
చెన్నై, (ఆంధ్రజ్యోతి): ‘కలైంజర్ మహిళా హక్కు’ పథకం కింద కుటుంబంలోని మహిళా పెద్దకు ప్రభుత్వం ఇవ్వదలచిన రూ.1000 ఆర్థిక సాయం కోసం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు దాదాపు 4.5 లక్షల దరఖాస్తులు రాగా, ఈ దరఖాస్తులను ఈనెల 6వ తేదీ నుంచి అధికారులు పరిశీలించనున్నారు. అయితే, చెన్నై(Chennai)లో సుమారుగా 17 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. దీంతో ఈ పథకాన్ని రెండు దశల్లో అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులోభాగంగా గత నెల 24వ తేదీ నుంచి ఈ దరఖాస్తుల వినియోగం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి, అర్హులైన వారి వివరాలను నమోదు చేస్తున్నారు. మొత్తం 1724 ప్రత్యేక శిబిరాలు ఈ నెల 4వ తేదీ వరకు కొనసాగుతాయి. ఇప్పటివరకు 6.18 లక్షల దరఖాస్తులను తొలి దశలోను, 53,568 దరఖాస్తులను రెండో దశలోనూ పంపిణీ చేశారు. వీటిలో 4.33 లక్షల దరఖాస్తులు భర్తీ చేసి తిరిగి అప్పగించారు. అయితే, తొలి దశ వివరాల నమోదు ఈనెల 3వ తేదీతో ముగియనుంది. ఇది ముగిసిన తర్వాత రెండో దశలో దరఖాస్తుల పంపిణీ చేపడుతారు.
అదేవిధంగా, 102 వార్డుల పరిధిలోని 724 రేషన్ షాపుల్లో 5 నుంచి 16వ తేదీ వరకు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. ఇదిలావుంటే, తొలిదశలో సమర్పించిన దరఖాస్తుల్లోని వివరాల పరిశీలన పనులు ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. దరఖాస్తుల్లో పేర్కొన్న అంశాలు సక్రమమేనా? పథకం అమలు కోసం రూపొందించిన నిబంధనలను లోబడే దరఖాస్తులు సమర్పించారా? ఇప్పటికే ఏదైనా ఆర్థిక సాయం పొందుతున్నారా? ఇప్పటికే పొందుతున్న ఆర్థిక సాయాన్ని దాచిపెట్టి.. ఇపుడు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారా? తదితర అంశాలపై అధికారులు ఆరా తీయనున్నారు. అలాగే, కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? ఒకే కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది దరఖాస్తు చేశారా? వంటి విషయాలను నిశితంగా ఆరా తీయనున్నారు. ఈ పనులు ఈనెల 6 నుంచి 15వ తేదీ వరకు ఇంటింటికి వెళ్ళి తనిఖీ చేయనున్నారు. 16వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ వివరాలను మరోమారు తనిఖీ చేస్తారు. వందశాతం తనిఖీ పూర్తయిన తర్వాతే ఈ పథకం కింద రూ.1000 ఆర్థిక సాయం పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. అయితే, ఈ ఆర్థిక సాయం కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసిన 9 రోజుల్లో కేవలం 50 శాతం మాత్రమే దరఖాస్తులు తీసుకున్నారు. మిగిలిన 8.47 లక్షల మందికి దరఖాస్తులను పంపిణీ చేసి, వారి వివరాలను నమోదు, తనిఖీ చేయాల్సి ఉంది. ఇందుకోసం అధికారులు వేగంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.