Share News

Chief Minister: మండిపడ్డ సీఎం.. మోదీసాబ్.. ఇక్కడి కరువు మీకు కనిపించడం లేదా...

ABN , First Publish Date - 2023-12-08T11:33:18+05:30 IST

‘రాష్ట్ర ప్రజలు ఏం పాపం చేశారు. మీకు అధికారం కట్టబెట్టలేదనేనా? కరువు కోరల్లో చిక్కుకుని అలమటిస్తున్న రాష్ట్రానికి ఒక్కపైసా విదిల్చని

Chief Minister: మండిపడ్డ సీఎం.. మోదీసాబ్.. ఇక్కడి కరువు మీకు కనిపించడం లేదా...

- ఆఫ్రికాలోని కెన్యాకు సాయం చేస్తారు కానీ.. మా రైతుల గోడు పట్టదా..?

- ముఖ్యమంత్రి సిద్దరామయ్య మండిపాటు

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్ర ప్రజలు ఏం పాపం చేశారు. మీకు అధికారం కట్టబెట్టలేదనేనా? కరువు కోరల్లో చిక్కుకుని అలమటిస్తున్న రాష్ట్రానికి ఒక్కపైసా విదిల్చని మీరు కెన్యా వ్యవసాయ క్షేత్రాల ఆధునికీకరణ కోసం 250 మిలియన్‌ డాలర్ల సాయం ప్రకటిస్తారా’ అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Chief Minister Siddaramaiah) ప్రధాని నరేంద్రమోదీపై మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ఆయన ‘ఎక్స్‌’ వేది కగా ప్రధాని తీరుపై పోస్టు చేశారు. కర్ణాటక రైతాంగంపట్ల కేంద్రం ఎంత తీవ్ర వివక్షతను ప్రదర్శిస్తున్నదో ఇంతకంటే తార్కాణం అవసరం లేదన్నారు. ఎక్కడో దూరంగా ఉన్న ఆఫ్రికా దేశం కెన్యా మాత్రం ప్రధాని కంటికి కనిపిస్తోందని, దేశంలోని కర్ణాటక రైతులు గత మూడు నెలలుగా కరువు పరిస్ధితి కారణంగా నానా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని, పైగా సాయం విషయంలో వివక్షతను ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. కెన్యాకు సాయం అందిస్తున్నందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ప్రపంచంలోని నిరుపేద దేశాలను ఆదుకునే సంప్రదాయం చాలా కాలంగా ఉందని పేర్కొన్నారు.

కర్ణాటక ప్రజలు ఏం పాపం చేశారని నిలదీశారు. వర్షాభావ పరిస్ధితి ఏర్పడి 48.19 లక్షల ఎకరాల వ్యవసాయ భూమిలో పంటనష్టం ఏర్పడిందని, రూ.30వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని, తక్షణ సాయంగా రూ. 4,663 కోట్లు, పూర్తిసాయంగా కనీసం రూ. 18,171 కోట్లు అందించాలని కేంద్రానికి పలుమార్లు నివేదించినా ఫలితం కనిపించడం లేదన్నారు. రాష్ట్రంలో బీజేపీకి 26 మంది ఎంపీలు ఉన్నా కేంద్రం నుంచి కరువు సాయం సాధించే విషయంలో విఫలమయ్యారని సీఎం విమర్శించారు. తమ ప్రభుత్వంపై, తనపై పనికిమాలిన ఆరోపణలు చేస్తూ బీజేపీ కాలహరణం చేస్తోందని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. కరువు పరిస్థితిని నిభాయించే విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తున్న బీజేపీ నేతలు దమ్ముంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కరువు సాయం అందేలా చూడాలని, కరువు తాలూకాల్లో మానవ పనిదినాలను 150కు పెరిగేలా చూడాలని ఆయన సవాల్‌ విసిరారు. మైనార్టీల సంక్షేమానికి దశలవారీగా రూ.10వేల కోట్ల గ్రాంటు ఇస్తామని తాను చెప్పిన మాట నిజమని, అదేదో ఇప్పడే విడుదల చేసేనట్లు బీజేపీ హంగామా చేస్తోందని సీఎం విరుచుకుపడ్డారు.

Updated Date - 2023-12-08T11:33:20+05:30 IST