Chief Minister: సీఎం సిద్దరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు.. హామీ ఇచ్చాం.. అమలు చేసి తీరతాం..

ABN , First Publish Date - 2023-07-20T12:36:25+05:30 IST

కాంగ్రెస్‌ అంటే నమ్మకమని, ప్రజలకు హామీ ఇచ్చాం అమలు చేసి తీరుతామని ప్రతి గృహిణి సంతోషంగా ఉండడమే గృహలక్ష్మి

Chief Minister: సీఎం సిద్దరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు.. హామీ ఇచ్చాం.. అమలు చేసి తీరతాం..

- ప్రతి గృహిణి సంతోషమే ‘గృహలక్ష్మి’ లక్ష్యం

- 1.30 కోట్ల మందికి ఏటా రూ.30వేల కోట్లు

- గృహలక్ష్మి యాప్‌ను ఆవిష్కరించిన సీఎం

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ అంటే నమ్మకమని, ప్రజలకు హామీ ఇచ్చాం అమలు చేసి తీరుతామని ప్రతి గృహిణి సంతోషంగా ఉండడమే గృహలక్ష్మి పథకం లక్ష్యమని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీలలో కీలకమైన గృహలక్ష్మి యాప్‌ను ఆయన బుధవారం లాంఛనంగా ఆవిష్కరించారు. విధానసౌధ బ్యాంక్వెట్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి స్ర్తీశిశుసంక్షేమశాఖ మంత్రి లక్ష్మీహెబ్బాళ్కర్‌ అధ్యక్షత వహించగా డీసీఎం డీకే శివకుమార్‌, మంత్రులు రామలింగారెడ్డి, కేహెచ్‌ మునియప్ప, భైరతి సురేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి గ్యారెంటీని సమస్య లేకుండా అమలు చేసి తీరతామన్నారు. ఇప్పటికే శక్తి గ్యారెంటీ ద్వారా రోజూ లక్షలాది మంది మహిళలు సంతోషంగా ప్రయాణం చేస్తున్నారని చెప్పారు. బంధుమిత్రుల ఊళ్లకైనా, దైవదర్శనాలకైనా డబ్బులు చెల్లించకుండానే ప్రయాణం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎవరూ ఆకలితో పస్తులుండరాదనే విధానానికి కట్టుబడ్డామని, అన్నభాగ్యను మరింత బలోపేతం చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం బియ్యం విషయంలో రాజకీయం చేసినా ఇచ్చిన హామీ మేరకు బియ్యానికి బదులుగా నగదు బదిలీ చేస్తున్నామన్నారు. మూడో గ్యారెంటీగా గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. జూలై నుంచి 200 యూనిట్ల దాకా విద్యుత్‌ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. నాల్గో గ్యారెంటీ గృహలక్ష్మి యాప్‌ రూపకల్పనలో కొంత జాప్యం జరిగిందన్నారు. ఐదు గ్యారెంటీలో ఇదే ఎక్కువ ఆర్థికమైనదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 1.30 కోట్ల మంది గృహిణులు లబ్దిదారులు అవుతారన్నారు. ఏడాదికి రూ.30వేల కోట్లు గృహిణుల ఖాతాలకు నేరుగా చేరుతుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నాలుగునెలలు ముగిసిందని, ఆగస్టు రెండోవారం తర్వాత పథకం వర్తింప చేస్తున్నందున అంతకు తగినట్లుగానే బడ్జెట్‌లో నిధులు కేటాయించామన్నారు. స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీహెబ్బాళ్కర్‌ మాట్లాడుతూ యాప్‌ను అన్ని వర్గాల ప్రజలు సులభతరంగా భర్తీ చేసుకునేలా రూపొందించామన్నారు. ఇందుకోసం భారీగా కసరత్తు జరిగిందన్నారు. బీపీఎల్‌ కార్డు పొందిన కుటుంబ యజమాని దరఖాస్తు చేసుకోవాలన్నారు. కర్ణాటక-1, బెంగళూరు- గ్రామ-1తో పాటు బాపూజీ సేవాకేంద్రాల ద్వారా ఉచితంగా నమోదు చేసుకోవచ్చు అన్నారు.

దరఖాస్తులో దళారుల ప్రమేయం లేకుండా అధికారికంగా ప్రజాప్రతినిధి పేరిట వలంటీర్లు ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ఉచితంగా నమోదు చేస్తారన్నారు. దరఖాస్తు చేసుకునేవారు బ్యాంకు పాస్‌బుక్‌(Bank passbook), బీపీఎల్‌ కార్డు నంబరు, యజమానితో పాటు భర్త ఆధార్‌ కార్డు, మొబైల్‌ నంబర్లను తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(Deputy Chief Minister DK Shivakumar) మాట్లాడుతూ గృహలక్ష్మి గ్యారెంటీ ద్వారా నెలసరి కుటుంబ అవసరాలకు అదనంగా చేయాల్సి వచ్చిన ఖర్చులకు అందిస్తున్న సొమ్ము అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా పట్టించుకునేది లేదన్నారు. ఎన్నికలకు ముందు ఆడపడచులకు హామీ ఇచ్చామని, అమలు చేసి తీరుతామన్నారు. కార్యక్రమంలో మంత్రులు రహీంఖాన్‌, మంకాళ్‌ వైద్య, మహదేవప్పతో పాటు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఇదే సందర్భంగా సీఎం, డీసీఎంలతో పాటు మంత్రులకు మంత్రి లక్ష్మీహెబ్బాళ్కర్‌ ఘనంగా సత్కరించారు.

Updated Date - 2023-07-20T12:36:27+05:30 IST