Chief Minister: సీఎం సంచలన వ్యాఖ్యలు.. మా వాళ్లు మునిగే పడవలో చేరారంటూ..
ABN , First Publish Date - 2023-04-21T07:42:58+05:30 IST
మా వాళ్లు మునిగే పడవలో చేరారని ముఖ్యమంత్రి పేరొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి) : దేశంలోని ఎన్నో రాష్ట్రాలలో కాంగ్రెస్ మునిగిపోయిందని ప్రస్తుతం కర్ణాటకలోను అదే స్థాయికి చేరిందని అటువంటి మునిగే పడవలో మా వారు చేరారని సీఎం బసవరాజ్ బొమ్మై(CM Basavaraj Bommai) ఎద్దేవా చేశారు. పేర్లు ప్రస్తావించకుండానే జగదీష్‌శెట్టర్, లక్ష్మణసవదిలను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బీదర్ జిల్లా బాల్కి నియోజకవర్గంలో గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందే అబద్దాల హామీలు ఇస్తున్నారన్నారు. కాంగ్రెస్ వారిని ప్రజలు ఎప్పటికీ నమ్మరన్నారు. చెత్తబుట్టలో వేసేలాంటి విజిటింగ్ కార్డులాగ కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులు మారాయన్నారు. గృహిణికి రెండువేలు, ఉచిత విద్యుత్, పది కేజీల బియ్యం వంటివి భోగస్ అంటూ కొట్టిపారేశారు. ప్రతి ఇంటికి 80-85యూనిట్‌లు విద్యుత్‌ను వాడుతారని అటువంటిది ఏకంగా 200ల యూనిట్‌లు ఎవరికి ఉచితంగా ఇస్తారని ప్రశ్నించారు. బీజేపీ(BJP) ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్‌ల పెంచి చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. ఎన్నో రాష్ట్రాలకు చెందిన దళిత నేత లు కొనియాడుతుంటే రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మాత్రం అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో టిప్పును గుర్తుచేసుకున్నారని 12వ శతాబ్దంలోనే సమాజంలో అందరూ సమానమన్న బసవణ్ణను మరిచారన్నారు. ఇద్దరు నాయకులు పార్టీని వీడినంత మాత్రాన నష్టం లేదన్నారు. సమావేశంలో కేంద్రమంత్రి భగవంత్ ఖూబా, ఎమ్మెల్యే శరణుసలగర్, మారుతి మూళె, మహారాష్ట్ర మాజీ మంత్రి సంభాజీ పాటిల్ సహా పలువురు ముఖ్యులు పాల్గొన్నారు.