Chief Minister: మహిళా రిజర్వేషన్ల అమలుకు మరో 15 ఏళ్లు ఎదురు చూడాల్సిందేనా...?
ABN , First Publish Date - 2023-09-24T10:40:22+05:30 IST
పార్లమెంటు ఉభయసభలలో ఆమోదం పొందిన మహిళా రాజకీయ రిజర్వేషన్ల అమలు కోసం మరో 15 ఏళ్లు ఎదురుచూడాల్సిన పరిస్థితిని
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): పార్లమెంటు ఉభయసభలలో ఆమోదం పొందిన మహిళా రాజకీయ రిజర్వేషన్ల అమలు కోసం మరో 15 ఏళ్లు ఎదురుచూడాల్సిన పరిస్థితిని కేంద్రం సృష్టించిందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) వ్యాఖ్యానించారు. బెంగళూరులో శనివారం రామ్‌మనోహర్ లోహియా సమతా విద్యాలయం, రాష్ట్ర బీసీ కులాల సమాఖ్య, అణగారిన వర్గాల సమాఖ్య సంయుక్తంగా మహిళా రిజర్వేషన్ల అంశంపై గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన సదస్సును సీఎం లాంఛనంగా ప్రారంభించి ప్రసంగించారు. మహిళా రిజర్వేషన్ల అమలుకు కులగణన, డీ లిమిటేషన్ అనే మెలికలు పెట్టారని, ఈ లెక్కన 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ, 2029 ఎన్నికల్లోనూ, 2034 ఎన్నికల్లోనూ మహిళా రాజకీయ రిజర్వేషన్లు అమలులోకి వచ్చే అవకాశం ఏ మాత్రం లేదన్నారు. దీన్నిబట్టే మహిళా రిజర్వేషన్లపై బీజేపీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్న సంగతి తెలుస్తోందన్నారు. కేవలం ఓట్ల కోసం లోక్‌సభ ఎన్నికల సమయంలో తెరపైకి తెచ్చారన్నారు. విద్యానిపుణుడు ప్రొఫెసర్ ముజఫర్ అసాది, ప్రముఖ న్యాయవాది రవివర్మ కుమార్, ఎమ్మెల్యే నయన మోటమ్మ, మహిళా న్యాయవాది అశ్విని ఓబులేశ్, బీసీల సమాఖ్య నేత కేఎం రామచంద్రప్ప, దళిత నేత మావళ్లి శంకర్, మాజీ మంత్రి బీటీ లలితానాయక్ సదస్సులో ప్రసంగించారు.