Share News

Chief Minister: ‘కరోనా’పై నిర్లక్ష్యం వద్దు.. అప్రమత్తంగా ఉందాం..

ABN , Publish Date - Dec 22 , 2023 | 12:27 PM

కొవిడ్‌ పట్ట నిర్లక్ష్యం వద్దు.. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, అప్రమత్తంగా ఉందాం అని సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) వైద్యాధికారులకు సూచించారు.

Chief Minister: ‘కరోనా’పై నిర్లక్ష్యం వద్దు.. అప్రమత్తంగా ఉందాం..

- చికిత్సకు అన్నీ సిద్ధం చేయండి

- వైద్యాధికారులకు సీఎం ఆదేశం

- కరోనాపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశం

- ప్రజలు సహకరించాలని పిలుపు

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ పట్ట నిర్లక్ష్యం వద్దు.. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, అప్రమత్తంగా ఉందాం అని సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) వైద్యాధికారులకు సూచించారు. రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు నమోదవుతున్న తరుణంలో సీఎం సిద్దరామయ్య ఉన్నతస్థాయి సమావేశం జరిపారు. గురువారం అధికారిక నివాసం ‘కృష్ణ’లో జరిగిన సమావేశంలో డీసీఎం డీకే శివకుమార్‌, హోం మంత్రి పరమేశ్వర్‌, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్‌ గుండూరావ్‌, వైద్యవిద్యాశాఖ మంత్రి శరణ ప్రకాశ్‌పాటిల్‌, కొవిడ్‌ టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ, వైద్యశాఖ ముఖ్య అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వారం రోజులుగా కొవిడ్‌ పరిణామాలపై కమిటీ చర్చలు జరిపింది. కొవిడ్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమాలోచనలు జరిపారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితి ప్రస్తుతానికి అదుపులో ఉందని, కొవిడ్‌ కొత్త వేరియంట్‌ పట్ల భయం అవసరం లేదని, అయితే నిర్లక్ష్యం చేయరాదన్నారు. గతంలో కొవిడ్‌కు అవసరమైన విధానాలపై చర్చించామన్నారు. వెంటిలేటర్లు, ఆక్సిజన్‌, పడకల పెంపు వంటి ప్రక్రియ వెంటనే అమలు చేయాలని అధికారులకు సూచించామన్నారు. కేంద్రప్రభుత్వం గతంలో వ్యాక్సిన్‌ ఉచితంగా ఇచ్చేదని, ప్రస్తుతం అవసరమైతే కొనుగోలు చేసి అయినా సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. కొవిడ్‌ టెస్టింగ్‌లను రోజుకు 5వేలకు పెంచుతున్నామన్నారు.

బెంగళూరుతోపాటు అన్ని జిల్లాల్లోనూ ఇకపై టెస్టింగ్‌లు ఉంటాయన్నారు. సాధారణ జబ్బులని ఎవరూ నిర్లక్ష్యం చేయరాదన్నారు. అనుమానం వస్తే స్వచ్ఛందంగా కొవిడ్‌ పరీక్షలు జరిపించుకోవాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 92మందికి కొవిడ్‌ ప్రబలిందని, వీరిలో 72మంది హోం ఐసొలేషన్‌లో ఉన్నారని, 20మంది ఆసుపత్రిలో ఉండగా వీరిలో ఏడుగురు కొవిడ్‌తోపాటు ఇతరత్రా జబ్బులు ఉన్నమేరకు ఐసీయూలో చికిత్స పొందుతున్నారన్నారు. గతంలో మూడు విడతల కొవిడ్‌ కాలంలో చోటు చేసుకున్న తప్పిదాలను పునరావృతం కారాదని సూచించామన్నారు. కేబినెట్‌ సమావేశంలో కొవిడ్‌ నియంత్రణకోసం ప్రత్యేకంగా సబ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఇకపై కొవిడ్‌ కేబినెట్‌ సబ్‌ కమిటీ, టెక్నికల్‌ అడ్వైజర్‌ కమిటీలు ప్రతి రెండు మూడు రోజులకోసారి భేటీ అవుతాయన్నారు. అవసరమైన నిర్ణయాలు, పరిస్థితులను బట్టి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటారన్నారు. వెంటనే సౌలభ్యాలు సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధమన్నారు. కొవిడ్‌ కోసం తీసుకునే ఎటువంటి విధానాలకైనా నిధుల కొరత లేదని, సమకూరుస్తామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు ప్రైవేట్‌ వైద్యశాలల్లోనూ చికిత్స అందుబాటులో ఉంటాయన్నారు. క్రిస్మస్‌, కొత్త సంవత్సర వేడుకలకు అభ్యంతరాలు లేవని, కానీ గుంపులుగా చేరే వేళ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాల్సిందేనని సూచించామన్నారు. కొవిడ్‌ నియంత్రణకు ప్రజల సహకారం అవసరమన్నారు. ప్రైవేట్‌ విద్యాసంస్థలు మాస్క్‌లు తప్పనిసరి చేయడం మంచిదేనని అభిప్రాయపడ్డారు. అన్ని విద్యాసంస్థలకు వర్తింపచేయడం సముచితమని సీఎం అభిప్రాయపడ్డారు. బాధ్యతాయుతంగా అందరూ వ్యవహరించాలని 60ఏళ్లు పైబడినవారు మాస్క్‌లు తప్పనిసరిగా వాడాలన్నారు. ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉన్నా మాస్క్‌ ధరించడం, గుంపులకు దూరంగా ఉండడం మంచిదన్నారు.

Updated Date - Dec 22 , 2023 | 12:27 PM