Chief Minister: ‘మిమ్మల్ని వెతుక్కుంటూ... మీ ఊరికే’
ABN , First Publish Date - 2023-11-24T08:13:26+05:30 IST
ప్రజల శ్రేయస్సు కోసం వివిధ పథకాలను ప్రవేశపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా ‘ఉంగళై తేడి...ఉంగళ్ ఊరిల్’ (మిమ్మల్ని వెతుక్కుంటూ..
- ప్రజా సమస్యలు తెలుసుకొనేందుకు సరికొత్త పథకం
- ఇకపై ప్రతి నెలా గ్రామాల్లో కలెక్టర్ల బస
- రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
పెరంబూర్(చెన్నై): ప్రజల శ్రేయస్సు కోసం వివిధ పథకాలను ప్రవేశపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా ‘ఉంగళై తేడి...ఉంగళ్ ఊరిల్’ (మిమ్మల్ని వెతుక్కుంటూ...మీ ఊరికే) అనే పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రతి జిల్లా కలెక్టర్ ప్రతి నెలా ఒక రోజు ఏదో ఒక గ్రామంలో బస చేసి, క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాలు పరిశీలించి, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సరిగ్గా అమలయ్యేలా తగిన చర్యలు పట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సక్రమంగా చేరుతున్నాయా? పలు శాఖలు అందిస్తున్న సేవలు ప్రజల చెంతకు చేరుతున్నాయా అనే విషయాలను ముఖ్యమంత్రి(Chief Minister) స్వయంగా పర్యవేక్షించే కార్యక్రమమే ‘క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి’. ‘ప్రజల వద్దకు వెళ్లండి, వారితో కలసి జీవించండి, వారి నుంచి నేర్చుకోండి, వారిని ప్రేమించండి, సేవ చేయండి’ అని చెప్పిన అన్నాదురై(Annadurai) కలను సాకారం చేసే ప్రాజెక్ట్ ఇది. ఎంతమంది అధికారులున్నా, కలెక్టర్‌కు ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం ఉంది.
అందుకే సోమవారం నిర్వహించే సమస్యల పరిష్కార శిబిరంలో కలెక్టర్‌కు స్వయంగా సమస్యలు తెలపాలని ప్రజలు కోరుకుంటారు. కలెక్టర్‌కు తెలిపితే తమకు పరిష్కారం లభిస్తుందని ప్రజల నమ్మకం. అందుకే ‘ఉంగళై తేడి... ఉంగళ్ ఊరిల్’ అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లా కలెక్టర్ నెలలో ఒకరోజు ఏదో ఒక గ్రామంలో బసచేసి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని ఆదేశించింది. ఈ కార్యక్రమం ‘క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి’ తదుపరి కార్యక్రమంగా భావించవచ్చని ప్రభుత్వం తెలిపింది. ప్రజల వద్దకే వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించే దిశగా జిల్లా యంత్రాంగం ప్రజల వద్దకే వస్తుందని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది.