Chief Minister: జనతా దర్శన్‌తో ప్రజలవద్దకే పాలన
ABN , First Publish Date - 2023-09-26T07:54:25+05:30 IST
ప్రజలు ఇకపై తమ సమస్యలను ఏకరువు పెట్టేందుకు సుదూర ప్రాంతాలనుంచి ముఖ్యమంత్రి నివాసం, సచివాలయానికి రావాల్సిన
- నెలలో రెండుసార్లు రాష్ట్రమంతా జనతాదర్శన్
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ప్రజలు ఇకపై తమ సమస్యలను ఏకరువు పెట్టేందుకు సుదూర ప్రాంతాలనుంచి ముఖ్యమంత్రి నివాసం, సచివాలయానికి రావాల్సిన అవసరం ఉండదు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి జనతాదర్శన్ కార్యక్రమాన్ని ఏకకాలంలో అన్ని జిల్లా కేంద్రాల్లోనూ సోమవారం నిర్వహించారు. ప్రజల నుంచి వేల సంఖ్యలో వినతిపత్రాలు స్వీకరించారు. జిల్లా, తాలూకా స్థాయిలోనే ప్రజల సమస్యలను ఆలకించి వాటిని అక్కడికక్కడే పరిష్కరించే దిశలో ప్రతి 15రోజులకోసారి జనతాదర్శన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) ప్రకటించారు. కాగా ఆయా జిల్లా కేంద్రాల్లో ఇన్‌చార్జ్ మంత్రులు సోమవారం ఉదయం నుంచే జనతాదర్శన్‌ను ప్రారంభించారు. స్థానిక ప్రజా ప్రతినిధులను, ఎంపీలను ఆహ్వానించారు. జిల్లా స్థాయిలో జరిగిన జనతాదర్శన్ కార్యక్రమాలకు డీసీలు, ఎస్పీలు, జిల్లా పంచాయతీ సీఈఓలు, ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈనెల 30న బెంగళూరులో రాష్ట్రస్థాయిలో జనతాదర్శన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తాలూకా, జిల్లా స్థాయిలో పరిష్కారం కాని వివాదాలు, ఇతర ప్రముఖ అంశాలను మాత్రమే రాష్ట్రస్థాయి జనతాదర్శన్‌లో పరిశీలించనున్నారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్(KPCC President DK Sivakumar) బెంగళూరులో సోమవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ఇన్‌చార్జ్ మంత్రుల సారథ్యంలో జనతాదర్శన్ కార్యక్రమాలు అర్థవంతంగా జరిగాయని, ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం బాగా దోహదపడిందన్నారు.
జనతాదర్శన్‌కు అనూహ్య స్పందన
రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జనతాదర్శన్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించిందని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులను జనతాదర్శన్‌కు ఆహ్వానించామని, అన్ని జిల్లాల్లో కలిపి 6,684 వినతిపత్రాలు అందగా వీటిలో కొన్నిటిపై అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకుని పరిష్కరించామన్నారు. రెవెన్యూశాఖకు సంబంధించిన సమస్యలపై 2వేలకుపైగా అర్జీలు వచ్చాయని, హావేరి జిల్లా నుంచి అత్యధికంగా 774 వినతి పత్రాలు అందగా హాసన్ జిల్లా నుంచి 432 వినతులు, కోలారు జిల్లా నుంచి 423 వినతులు అందినట్టు సీఎం కార్యాలయం వెల్లడించింది. మొత్తం 31 రెవెన్యూ జిల్లాల్లో స్వీకరించిన వినతి పత్రాల గణాంక వివరాలను సోమవారం మీడియాకు విడుదల చేసింది.