Chief Minister: ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు.. నా భార్యకూ ఉచితమే..

ABN , First Publish Date - 2023-06-03T12:57:18+05:30 IST

ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఆకర్షించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన గ్యారెంటీల అమలుకు అడుగులు పడ్డాయి. ముఖ్యమంత్రిగా

Chief Minister: ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు.. నా భార్యకూ ఉచితమే..

- ఇక గ్యారెంటీల అమలు

- 11 నుంచి ఉచిత ప్రయాణం

- ఏసీ, స్లీపర్‌, లగ్జరీ బస్సులు మినహాయింపు

- రాష్ట్రమంతటా మహిళలందరికీ వర్తింపు

- జూలై నుంచి గృహజ్యోతి, అన్నభాగ్య

- స్వాతంత్య్ర దినోత్సవాన గృహలక్ష్మి

- కేబినెట్‌ తీర్మానాలను వెల్లడించిన సీఎం

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఆకర్షించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన గ్యారెంటీల అమలుకు అడుగులు పడ్డాయి. ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య ప్రమాణస్వీకారం చేసిన రోజే గ్యారెంటీలకు కేబినెట్‌లో ఆమోదం పలికారు. అందుకు అనుగుణంగానే రెండు వారాలకుపైగా సుదీర్ఘ కసరత్తు జరిపి శుక్రవారం కేబినెట్‌లో గ్యారెంటీలు అమలు చేసేలా తీర్మానించారు. కేబినెట్‌ నిర్ణయాలను సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) స్వయంగా మీడియాకు వివరించారు. ఈనెల 11 నుంచే రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచి అయినా మహిళలు, విద్యార్థినులు ఉచితంగా ప్రయాణించే తొలి గ్యారెంటీ అమలులోకి రానుందని స్పష్టం చేశారు. కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చునని తెలిపారు. ఏసీ, స్లీపర్‌, లగ్జరీ బస్సులు మినహాయించి మిగిలిన అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం ఉందన్నారు. బస్సుల్లో 50 శాతం సీట్లు పురుషులకు కేటాయించాల్సి ఉంటుందన్నారు. గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను కూడా అమల్లోకి తీసుకురానున్నారు. ఉచిత విద్యుత్‌ దుర్వినియోగం కాకుండా చూసేందుకు గడిచిన 12 నెలల సరాసరి విద్యుత్‌ వాడకంపై అదనంగా 10 శాతం ఉచితంగా పొందవచ్చు. పెండింగ్‌ బిల్లులతోపాటు జూన్‌ నెలాఖరు దాకా విద్యుత్‌ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. జూలై నుంచి ఉచిత విద్యుత్‌ అమలులోకి రానుంది. అన్నభాగ్య పథకం ద్వారా జూలై నెల నుంచి బీపీఎల్‌, అంత్యోదయ కార్డులు కల్గిన ప్రతి సభ్యుడికి 10 కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఈ నెలలో చౌకదుకాణాల ద్వారా ఇప్పటికే బియ్యం పంపిణీ ప్రక్రియ ప్రారంభమైనందున వచ్చే నెలనుంచి అమలు చేయనున్నారు. గృహలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని బీపీఎల్‌, ఏపీఎల్‌ కార్డులు కల్గిన కుటుంబ యజమాని ఖాతాలకు రూ.2వేలు నేరుగా నగదు బదిలీ చేస్తామన్నారు. లబ్ధి పొందదలిచిన మహిళలు కుటుంబ యజమాని ఎవరనేది నిర్ణయించుకుని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈనెల 15 నుంచి జూలై 15వరకు దరఖాస్తులకు అవకాశం ఉంది. ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా నెంబరు అనుసంధానం చేయాలి. జూలై 15 నుంచి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగనుంది. 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల రోజున పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు. 2022-23 విద్యాసంవత్సరంలో వృత్తి విద్యాకోర్సులతోపాటు డిగ్రీ, డిప్లొమో పూర్తి చేసినవారికి యువనిధి గ్యారెంటీ వర్తించనుంది. డిగ్రీ పొందిన ఆరు నెలల్లోపుగా ఉద్యోగం లభించని పక్షంలో 24 నెలలపాటు నిరుద్యోగ భృతి అందిస్తామన్నారు. డిగ్రీ పూర్తి చేసినవారికి రూ.3వేలు, డిప్లొమో పూర్తి చేసినవారికి రూ.1500 నిరుద్యోగ భృతి లభించనుందన్నారు. లబ్ధి పొందదలిచినవారు యువతీ యువకులే కాకుండా ట్రాన్స్‌జెండర్లకు కూడా వర్తించనుందన్నారు.

సుదీర్ఘ కసరత్తు

ఎన్నికల్లో ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఐదు గ్యారెంటీలను ప్రకటించింది. ప్రజలు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య ప్రమాణ స్వీకారం చేసిన రోజే గ్యారెంటీలకు ఆమోదం తెలుపుతామని ప్రకటించారు. అయితే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముందుగానే రాష్ట్ర ఆర్థిక శాఖ సీనియర్‌ అధికారులతో సిద్దరామయ్య మంతనాలు జరిపారు. ప్రమాణ స్వీకారం చేశాక ఓ వైపు ఆర్థిక నిపుణులు సీనియర్‌ అధికారులతో దాదాపు పది విడతలకుపైగానే చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. బడ్జెట్‌లో ఇతర విభాగాలకు ఎక్కడా భంగం కలగకుండా గ్యారెంటీలను అమలు చేసేందుకు కసరత్తు సాగించారు. ఐదు గ్యారెంటీలు సంపూర్ణంగా అమలు చేసేందుకు కనీసం రూ.50వేల కోట్లు అదనంగా అవసరం ఉంటోందని తెలుస్తోంది. చివరకు మంత్రివర్గంలోనూ మూడు సార్లకుపైగా ఇవే అంశాలపై సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌ సుదీర్ఘ చర్చలు జరిపారు. ఎట్టకేలకు అన్ని గ్యారెంటీలకు ఒకేసారి ఆమోదం తెలిపారు.

నా భార్యకూ ఉచితమే: సీఎం

ఉచిత బస్సు ప్రయాణంపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. అయినా మీడియా సందేహాలను వ్యక్తం చేసింది. ఒకానొక దశలో మహిళలందరికీ ఏ విధంగా ఉచితంగా ప్రయాణం అమలు చేస్తారనే ప్రశ్నకు సమాధానంగా రాష్ట్రంలోని మహిళలందరికీ వర్తింప చేస్తామని, చివరకు తన భార్యకూ ఉచిత ప్రయాణం వర్తిస్తుందని ఎవరికీ సందేహం అవసరం లేదన్నారు. చీఫ్‌ సెక్రటరీ కూడా ఉచిత బస్సు ప్రయాణం వినియోగించుకోవచ్చునన్నారు.

Updated Date - 2023-06-03T12:57:18+05:30 IST